* నకిలీ పత్రాలతో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐఓబీ)కు టోకరా వేశారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద నకిలీ పత్రాలు సృష్టించి రూ.1.39 కోట్లు రుణాలు తీసుకున్న నిందితులను హైదరాబాద్ సీసీస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ పథకం పేరిట ఐఓబీలో నకిలీ ఇన్‌వాయిస్‌లు, అగ్రిమెంట్లు సృష్టించి 8 మంది రుణాలు తీసుకున్నారు. దీనిపై ఐఓబీ చీఫ్ రీజినల్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యా్ప్తు మొదలుపెట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌కి చెందిన కీలక సూత్రధారి శ్రీనివాస్ నాయక్‌తో పాటు మరో వ్యక్తి రవిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
* రావులపాలెంలో వివిధ పత్రికలకు చెందిన ఆరుగురు విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఓ బియ్యం లారీని ఆపి డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో.. వీరిపై కేసు నమోదు చేశారు.ఈ నెల 14న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి నుంచి కాకినాడకు బియ్యం బస్తాలు రవాణా చేస్తున్న లారీని నిందితులు అడ్డుకున్నారు.ఏడుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి లారీని ఆపారు. డ్రైవర్‌ను దిగమన్నారు. బియ్యం బస్తాలకు సంబంధించిన బిల్లు చూపించమని అడిగారు.డ్రైవర్ బిల్లు చూపించగా అది రేషన్ బియ్యమని విలేకరులు వాదించారు. డైవర్‌ను యజమానికి ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు.రైస్ మిల్ గుమస్తాతో మాట్లాడి రెండు లక్షలు ఇస్తేనే లారీని విడిచి పెడతామన్నారు. లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. లారీ సీజ్ చేస్తామని హడలెత్తించారు.
* ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. గంటల కొద్దీ వినియోగం.. సామాజిక మాధ్యమాల్లో షికార్లు.. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు తెలివిగా వల విసురుతున్నారు. అవగాహన లేమి.. ఆశతో ఆ వలలో చిక్కుకుని నిండా మునిగిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి మంగళవారం కాలనీలు.. బస్తీలు.. గేటెడ్ కమ్యూనిటీల్లో అవగాహన కల్పిస్తున్నారు. బాధితులతో స్వయంగా మాట్లాడించి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
* మనుషుల మసస్తత్వం, ప్రవర్తనపై అధ్యయనం చేసి వారిని మామూలుగా మార్చాల్సిన ఓ సైకాలజిస్టు డబ్బుకోసం అడ్డదారిలో వెళ్లి పోలీసులకు చిక్కాడు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సైకాలజిస్ట్‌గా పనిచేస్తున్న రహమీన్ చరాణియా (25) ఓ బేకరీ ప్రారంభించి కేకుల్లో డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తూ దొరికిపోయాడు. ఇటీవల ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సోదాలు నిర్వహించగా కేకులు, బ్రౌనీల్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడని, వాటిని రేవ్ పార్టీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ మాట్లాడుతూ.. ‘‘చూడటానికి కేకుల్లా కనిపించినా ఇందులో డ్రగ్స్ నింపాడు. అవన్నీ ప్యాక్ చేసి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. అలా 10 కిలోల కేకుల్లో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించాం. జనాలను ఆకట్టుకునేందుకు రెయిన్‌బో కేకులని చెప్పి అందులోని తయారు చేసే మైదాపిండిలో మాదకద్రవ్యాలను కలిపాడు. అతడి ఇంట్లోనూ రూ.1.7లక్షలు విలువజేసే ఓపీఎమ్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నాం’’ అని వివరించారు.