ScienceAndTech

మీ చెమటతో ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చు

మీ చెమటతో ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చు

మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్‌ మొబైల్‌ ఫోన్‌. సాధారణంగా మొబైల్‌ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్‌. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్‌ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్‌ ఫోన్లకు ఛార్జింగ్‌ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్‌ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్‌ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్‌ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్‌ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్‌వాచ్‌ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్‌పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు.