Business

భారత వాయు సేవల రంగం కుదేలు

Indian air traffic and revenue witnesses lowest rates in 5 years-TNILIVE

అయిదేళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా 2019 ఏప్రిల్‌ నెలలో దేశీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసినట్లు అంతర్జాతీయ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(ఐఏటీఏ) ప్రకటించింది. రుణసంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానయాన సేవలు నిలిపి వేయడం కూడా దీనికి ఒక కారణం అంటూ ఐఏటీఏ వెల్లడించింది. దేశీయ ఎయిర్‌ ట్రాఫిక్‌ ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేయడం 2014 జనవరి తర్వాత ఇదే మొదటిసారని ఐఏటీఏ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐఏటీఏ పరిధిలో 290 వివిధ విమానయాన సంస్థలు ఉన్నాయి. వీటిలో భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, విస్తారా, స్పైస్‌ జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ అసోసియేషన్‌లో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2019లో 0.5 శాతం దేశీయ ఎయిర్‌ ట్రాఫిక్‌లో తగ్గుదల నమోదయిందని ఐఏటీఏ ప్రకటించింది. ‘గత అయిదేళ్లలో ఏటా ఎయిర్‌ ట్రాఫిక్‌ సగటున 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.5 శాతం మేర పడిపోవడానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు నిలిపివేయడమే ప్రధాన కారణం. అంతేకాకుండా విమానయాన ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపడంతో డిమాండ్‌ తగ్గింది. దేశీయంగా తగ్గినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ 4.3 శాతం వృద్ధి నమోదు చేసింది’ అని ఐఏటీఏ వివరించింది.