* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. వాళ్ల కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్న షర్మిల అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వాళ్ల కష్టాలు విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణం కానుంది. దీన్ని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా పిలుస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకునేందుకు ఈమార్గం అనువుగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తెలంగాణలో ఖమ్మం జిల్లాల్లో భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఖమ్మంలో కొంతమేరకు పూర్తయింది. ఇప్పటికే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా చేపట్టారు.
* సోలార్ ప్రాజెక్టు టెండర్ల రద్దుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. టెండర్లు రద్దు చేసి కొత్తవి పిలవాలని, ఫైనల్ చేయొద్దని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ చేసిన డివిజన్ బెంచ్.. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. విచారణ ముగిసే వరకు టెండర్లు ఫైనల్ చేయొద్దని ఆదేశించింది.
* అంతరిక్షయానంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన ‘న్యూ షెపర్డ్’ ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ఈ యాత్రను చేపట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగించారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైన కొద్దిరోజులకే అమెజాన్ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం కూడా విజయవంతమవడం విశేషం.
* ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరో వారం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
* కృష్ణా, గోదావరి నదీజలాల బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల హక్కులను కాల రాసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. వివాదం లేని ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకునేందుకు ఏపీ సీఎం జగన్ కేంద్రానికి దోహదపడ్డారని ఆరోపించారు.
* తెలంగాణలో ‘దళిత బంధు’ అనేది ఒక్క హుజూరాబాద్‌కు మాత్రమే కాదని.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఒక్క హుజూరాబాద్‌కే అయితే ఎన్నికల కోసమే అన్నట్లు చూడాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
* దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘావర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల విద్రోహ డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అదే తరహాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి దిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల హెచ్చరించాయి
* తెలంగాణలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తెలిపారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
* టాటా, బిర్లా, అంబానీ వంటి ప్రముఖుల బ్యాంకు డిపాజిట్లు, రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సామాన్య పౌరులు తెలుసుకునే అవకాశం ఉందా?అన్న అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు జరిగాయి. బ్యాంకుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ‘సమాచార హక్కు చట్టం’ కింద అందజేయాలని ఆరేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం ఆర్‌బీఐని ఆదేశించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారమూ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై మదుపర్లలో సందేహాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ నష్టాల్లో పయనిస్తున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మరో వారం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్షించిన సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
* కరోనా, కొవిడ్ బాధిత కుటుంబాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఆరోపించారు. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనలో మరణాలు తక్కువ చేసి చూపించి రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసిందన్నారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ఒక్కరోజే 31 మంది చనిపోతే.. కేవలం 11 మంది మాత్రమే మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకలో కొవిడ్ మృతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని.. ఏపీలో అలాంటి ప్యాకేజీ ఏదీ లేదన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని.. వీటిపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. మూడోదశ కరోనా హెచ్చరికల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కనకమేడల కోరారు.
* మోసపూరిత ఎన్నికల హామీలే వైకాపాకు భస్మాసుర హస్తంగా మారుతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. ఉద్యోగాల కల్పనలో జగన్ ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహం, మోసం భరించలేకే నిరుద్యోగులు సీఎం ఇంటిని ముట్టడించారన్నారు. నిరుద్యోగులు ఉద్యమం చేస్తే తప్ప వాస్తవాలు బోధ పడని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. కడుపుమంటతో రోడ్డెక్కిన యువతను అవహేళన చేస్తే 151 సీట్లు ఉన్న ప్రభుత్వం కూడా పేకమేడలా కూలిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
* అమరావతి భూముల కొనుగోళ్ల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం జగన్ మారాలని అని తెదేపా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ తక్షణమే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఎన్నో తప్పిదాలు చేసి తాత్కాలిక ఆనందం పొందుతున్నారన్నారని ఆక్షేపించారు. ‘‘పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది?జగన్ తప్పిదాల కారణంగా ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయి’’ అని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.