విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం గుట్టురట్టు చేసేందుకు ముంబయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ మాంటె కార్లో’లో హైదరాబాద్‌లోని ప్రముఖులకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. ముంబయి అధికారుల సమాచారం ప్రకారం హైదరాబాద్ డీఆర్‌ఐ అధికారులు సోమవారం మలక్‌పేట ప్రాంతంలో ఖరీదైన ‘నిస్సాన్ పెట్రోల్’ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ స్థిరాస్తి వ్యాపారి దీన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. నగరానికి చెందిన అనేక మంది ముంబయి ముఠా నుంచి కార్లు కొనుగోలు చేసినట్లు భావిస్తున్న అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గడచిన కొద్ది సంవత్సరాల్లో ముంబయి పోర్టుకు ఇలా 50 వరకూ కార్లు దిగుమతి అయ్యాయని, వాటిలో చాలా కార్లు హైదరాబాద్‌లో అమ్మారని డీఆర్‌ఐ అధికారులు భావిస్తున్నారు. కనీసం రూ.కోటిపైనే ధర ఉండే కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు కొనుగోలు చేస్తుంటారు. ఎవరెవరు కొనుగోలు చేశారో గుర్తించి, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొనుగోలు చేసిన వారిపై కేసులూ నమోదు చేయనున్నారు.
*** దిగుమతి సుంకం ఎగ్గొట్టేందుకే..
విదేశాల నుంచి తెప్పించే విలాసవంతమైన కార్లకు భారీగా సుంకం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కారు విలువపై 204 శాతం దిగుమతి సుంకం కింద చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని గుడ్‌గావ్‌లోని ఓ విలాసవంతమైన కార్ల విక్రయాల సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న లియాకత్ బచావ్ ఖాన్‌తోపాటు నిపుణ్ మిగ్లానీ, సురియా అర్జునన్‌లు కుంభకోణానికి తెరతీశారు. వీరు రాయబారుల పేర్లతో కార్లు దిగుమతి చేస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ముంబయి డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టారు. దిల్లీలో ఉంటున్న ఆఫ్రికా దేశానికి చెందిన ఓ రాయబారి పేరు మీద ఓ కారు వస్తోందన్న నిర్దిష్టమైన సమాచారం మేరకు అధికారులు ముంబయి పోర్టులో కాపుకాశారు. వారు ఊహించినట్లే దిగుమతి అయిన కారును ఓ లారీలో ఎక్కించి ముంబయిలోని అంధేరిలో ఉన్న కార్ల షోరూంకు తరలించారు. అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారు. గడచిన సంవత్సర కాలంలో దాదాపు 20 కార్లు తెప్పించినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. ఈ కార్లకు మణిపుర్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో దళారులే రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కో కారుపై కనీసం రూ.కోటి మిగులుతుండటంతో ఈ ముఠా గత కొంతకాలంగా ఇదే పనిలో ఉందని తేలింది. రాయబారుల పేర్ల మీద కార్లు తెప్పించాలంటే సంబంధిత రాయబార కార్యాలయాల నుంచి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లియాకత్ ముఠా నకిలీ పత్రాలు సృష్టించిందని, యూఏఈలోని ఓ భారతీయుడు ఈ వ్యవహారాలను పర్యవేక్షించేవాడని అధికారుల దర్యాప్తులో తేలింది.