ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల కన్నా అసలు పార్టీ అభ్యర్థిత్వం దక్కని వారు ప్రస్తుతం చాలా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి అవి దక్కనివారు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంటున్నారు. పరాజయం పాలు కాకుండా, ఆర్థికంగా చిత్తుకాకుండా వారు బయటపడ్డారు. అటువంటి వారిలో ముఖ్యుడు, తిరువూరు మాజీ శాసనసభ్యుడు, తెదేపా సీనియర్ నేత నల్లగట్ల స్వామిదాస్ ఒకరు.
*** సుదీర్ఘ అనుబంధం తెగినట్లేనా?
స్వామిదాస్‌తో పాటు ఆయన భార్య సుధారాణికి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 30ఏళ్ల పాటు స్వామిదాస్ దంపతులు పార్టీలో కీలకనేతలుగా ఎదిగారు. స్వామిదాస్ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు ముచ్చటగా ఓడిపోయారు. సుధారాణి ప్రతిష్ఠాత్మకమైన కృష్ణాజిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవిని నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో సుధారాణి పనితీరు ప్రభావం స్వామిదాసుపై పడింది. అయినప్పటికీ పార్టీ సుధారాణిని రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కీలకమైన ఎస్సీ కమీషన్ సభ్యురాలిగా పదవులను కట్టబెట్టింది.
*** భ్రష్టు పట్టిన తెలుగుదేశం
గత అయిదు సంవత్సరాల కాలంలో తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భ్రష్టుపట్టిపోయింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయింది. స్వామిదాసుతో సహా సీనియర్ తెలుగుదేశం నాయకులు భారీగా సంపాదించారని పేరు ప్రజల్లో బాగా నాటుకుపోయింది. కార్యకర్తలను వారు ఏమాత్రం పట్టించుకోలేదు. వైకాపా తరపున ఎన్నికైన ఎమ్మెల్యేను ఉత్సవ విగ్రహంగా మార్చారు. నియోజకవర్గ తెదేపా పార్టీ కన్వినర్ హోదాలో స్వామిదాస్ చెలరేగిపోయారు. అధికారుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపైన ఫిర్యాదులు వచ్చాయి. దేశం నాయకులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. తిరువూరు మున్సిపాల్టీలో నెలకొన్న పరిస్థితులు తెదేపా నాయకుల అవినీతి అక్రమాలుకు పరాకాష్ఠగా నిలిచింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ముఖ్య కార్యకర్తలు సైతం వైకాపాకు బాహాటంగానే పనిచేశారు. వైకాపా అభ్యర్థి రక్షణనిధికి నియోజకవర్గంలో 11000 ఓట్ల భారీ మెజార్టీ లభించింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఏ ఎమ్మెల్యేకి ఇంత మెజార్టీ రాలేదు. స్వామిదాస్ ఇటు ప్రజల్లోనూ, అటు పార్టీలోనూ పలచనయ్యారు. ఇది గమనించిన తెదేపా అధిష్టానం మంత్రి జవహర్‌ను అసెంబ్లీ బరిలోకి దింపింది. స్వామిదాస్ కన్నా మహాఘనుడిగా పేరుపొందిన జవహర్‌ను తిరువూరు ప్రజలు అసలే అంగీకరించలేదు. ఎన్నికల అనంతరం జవహర్ కొవ్వూరు వెళ్తారని స్వామిదాస్ వర్గం భావించింది. అయితే బుధవారం నిర్వహించిన ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో జవహర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన కొవ్వూరు వెళ్లకుండా తిరువూరులోనే ఉంటారని సమాచారం. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీలో స్వామిదాస్ దంపతుల శకం ముగిసినట్లేనని ఆ పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. —కిలారు ముద్దుకృష్ణ సీనియర్ జర్నలిస్ట్.