ఓ క్రీడాకారుడు.. ఆడితే అక్కడే ఆడాలి..! ఓ క్రీడాభిమాని.. చూస్తే వాటినే చూడాలి..!
ప్రపంచ క్రీడాకారులంతా ఒక చోటికి చేరే వేదిక అది! ప్రపంచమంతా కళ్లప్పగించి చూసే సంబరమది!
200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది.. అంతా కలిసి ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రీడా సంబరాన్ని ఒక యజ్ఞంలా జరిపిస్తుంటే.. ప్రపంచం నలుమూలల నుంచి వందల కోట్ల మంది వాటిని వీక్షిస్తూ.. క్షణ క్షణం ఉత్కంఠకు గురవుతూ.. భావోద్వేగాల్లో మునిగి తేలే అరుదైన సందర్భమిది.
ఓ అథ్లెట్ ఆట కోసం జీవితాన్నే అంకితం చేసి.. ఎన్నో త్యాగాలు చేసి.. కొన్నేళ్ల సమయాన్ని వెచ్చించి.. ఒళ్లు హూనం చేసుకుని.. రేయింబవళ్లు శ్రమించేది ఈ విశ్వ క్రీడల్లో పోటీ పడాలని, పతకాన్ని ముద్దాడాలనే.
ఇదే లక్ష్యంతో బరిలోకి దిగే మేటి క్రీడాకారుల మధ్య ప్రతి పోరూ ఒక యుద్ధమే. ఏళ్ల శ్రమకు కొన్ని క్షణాల్లో ఫలితం దక్కొచ్చు. ఆ కొన్ని క్షణాల్లోనే కష్టమంతా నేలపాలు కావచ్చు. ఏం జరిగినా.. అంతులేని ఉద్వేగమే!
ఓవైపు మనకు ఉద్వేగాన్ని కలిగించే సొంత క్రీడాకారుల పోటీలు.. మరోవైపు మనలో ఉత్సాహాన్ని నింపే ప్రపంచ మేటి అథ్లెట్ల పోరాటాలు.. ఏవి చూసినా మజానే!
కొత్త ఆటలు.. సరికొత్త విన్యాసాలు… కొంగొత్త ఛాంపియన్లు.. రికార్డులు.. సంచలనాలు.. మరపురాని విజయాలు.. బాధపెట్టే ఓటములు.. నవ్వులు.. కన్నీళ్లు.. వివాదాలు.. విచిత్రాలు.. అన్నింటి మేలు కలయిక.. ఒలింపిక్స్!
కరోనా దెబ్బకు ఒక ఏడాది వాయిదా పడ్డా.. మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు.. ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టేస్తున్నారు. ఇక వచ్చే రెండు వారాల్లోనూ అడ్డంకులు తప్పకపోవచ్చు. వాటిని అధిగమించి ఒలింపిక్స్ స్ఫూర్తి పతాకాన్ని ఎగురవేయాలని.. టోక్యో విశ్వక్రీడలు చరిత్రలో నిలిచిపోవాలని ప్రతి క్రీడాభిమాని ఆకాంక్ష.