Food

కందగడ్డలతో ఐస్‌క్రీం

కందగడ్డలతో ఐస్‌క్రీం

కంద… పేరు వినగానే వేపుడు, పులుసు, పచ్చడి… ఇలా రకరకాల వంటలు గుర్తొస్తాయి. కానీ అది తియ్యగా వంకాయ రంగులో ఉంటుందనీ దాంతో ఐస్‌క్రీములూ కేకులూ జామ్‌లూ జ్యూస్‌లూ… ఇలా ఎన్నో వెరైటీలూ తయారుచేయొచ్చనీ చాలామందికి తెలీకపోవచ్చు. కానీ దాన్ని అలా వెరైటీగా తినడమే తాజా పుడ్‌ ట్రెండ్‌ అంటున్నారు ఆధునిక ఫుడీలు. అనడమే కాదు, ఈ దుంపని విభిన్న రుచుల్లో ఆస్వాదిస్తూ ఇన్‌స్టా పోస్టులూ పెడుతున్నారు.
*‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?’ అనడం వినే ఉంటారు. కంద అంటేనే దురదకి మారుపేరుగా భావించి వండటానికే ఇష్టపడనివాళ్లు కొందరైతే, వండేలా వండితే కంద పులుసుని మించిన రుచి లేదని అంటారు మరికొందరు. అలాంటి కంద వంగ రంగులో కాస్త
తీపి రుచితోనూ దురద లేకుండానూ పండుతోంది. పైగా ఈ దుంపలన్నీ ఒకేలా ఉండవు. వీటిల్లోనూ ప్రాంతాన్ని బట్టీ నేలను బట్టీ భిన్న రూపాల్లో పండుతుంటాయి. అందులో భాగంగా ఫిలిప్పీన్స్‌లో పండే ఒక రకం చిలగడదుంపని పోలి ఉంటుందట. అక్కడ దాంతో ఎన్నో రకాల స్వీట్లూ డెజర్ట్‌లూ చేయడమే కాదు, వాటిని ఎంతో ఇష్టంగానూ తింటారు. అక్కడి నుంచే ఇది అన్ని ప్రాంతాలకీ పాకి పర్పుల్‌ యామ్‌… ఫేవరెట్‌ కలర్డ్‌ ఫుడ్‌గా ఇన్‌స్టాలోకి చొరబడింది. ముఖ్యంగా ఐస్‌క్రీముల్లో దీని వాడకం బాగా పెరిగిందట.
*మనదగ్గర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా పెంచుతున్నారు. ఈ దుంపల్ని కొన్నిచోట్ల రాటలు అనీ పిలుస్తారు. ఈ రకం కందలో తేమ, పిండిపదార్థాలు, ఆంథోసైనిన్ల శాతం చాలా ఎక్కువ. అంతేకాదు, విటమిన్‌-సి, ఎ పుష్కలంగా ఉండటం వల్ల బీపీ, మధుమేహం, హృద్రోగాలూ, క్యాన్సర్లూ, నాడీ సంబంధ సమస్యలూ రాకుండా అడ్డుకుంటుందట. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లూ ఇతరత్రా అనేక పోషకాలు డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడతాయనీ చెబుతున్నారు.
*దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కావడం వల్ల రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిల్లోని ఫ్లేవనాయిడ్లకి ఇన్సులిన్‌ నిరోధానికి కారణమైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచే గుణం ఉందనీ చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు, కప్పు కంద ముక్కల్లో ఐదు గ్రా. పీచు ఉంటుందట. ఇది రక్తంలో చక్కెర శాతం పెరగకుండా అడ్డుకోవడమే కాదు, కొలెస్ట్రాల్‌ పేరుకోకుండా ఉండేందుకూ తోడ్పడుతుంది. ఈ దుంపల్లోని ఎ, సి విటమిన్లు ఆస్తమానీ నివారిస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి బీపీ రోగులకీ మంచిదే. అంతేకాదు, ఇవి పొట్టలోని బ్యాక్టీరియాని పెంచడం ద్వారా జీర్ణసమస్యల్నీ నివారిస్తాయట.
*వీటిని క్రమం తప్పక తినేవాళ్లలో ఎ-విటమిన్‌ సమృద్ధిగా అందడంతో దృష్టిలోపాలు రాకుండా ఉంటాయట. ఫాస్ఫరస్‌, ఫోలేట్‌, ఐరన్‌… వంటివన్నీ పుష్కలంగా ఉండటంతో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కాల్షియం శాతం కూడా ఎక్కువ కాబట్టి పెరిగే పిల్లల్లో ఎముకల వృద్ధికీ తోడ్పడుతుందీ కంద. అంతేకాదు, దీన్ని రోజూ తింటే పొట్టలో హానికర బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. మొత్తమ్మీద రంగూరుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తుందన్న కారణంతోనే ఈ దుంపల్ని పండించి రకరకాలుగా వండేస్తున్నారు. పొడి చేసి అన్నింట్లోనూ చల్లేస్తున్నారు. మనమూ ట్రై చేద్దామా?!