Business

ఇండియాలో ఇ-రూపీ ప్రారంభం-వాణిజ్యం

ఇండియాలో ఇ-రూపీ ప్రారంభం-వాణిజ్యం

* భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇ-రూపీ’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇ-రూపీ కీలక పాత్ర పోషించనుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. లబ్ధిదారులకు పారదర్శకంగా నగదు చేరేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇ-రూపీ వ్యవస్థలో ఒక క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తారు. వీటినే ఇ-రూపీగా భావించొచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ లేని వారు వోచర్‌ కోడ్‌ చెప్పినా సరిపోతుంది.

* ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ ప్రదర్శనగా పేరొందిన భారత ‘ఆటో ఎక్స్‌పో’ వాయిదా పడింది. కరోనా వ్యాప్తి, మూడో వేవ్‌ అంచనాల నేపథ్యంలోనే 2022 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ (సియామ్‌)’ ప్రకటించింది. ఈ ప్రదర్శన నిర్వహిస్తే అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపింది. అప్పుడు భౌతిక దూరం పాటించడం సహా ఇతర కొవిడ్‌ నిబంధనల్ని అమలు చేయడం కష్టతరమవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆటో ఎక్స్‌పోను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ ఏడాది చివరలో తదుపరి ఆటో ఎక్స్‌పో తేదీలను ప్రకటిస్తామని స్పస్టం చేసింది. 2020 ఆటోఎక్స్‌పోకు ఆరు లక్షల మంది రావడం గమనార్హం.

* కేంద్ర బ‌డ్జెట్ 2020లో కొత్త ప‌న్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత రెండింటిలో ఏదైనా ఒక ప‌న్ను వ్య‌వ‌స్థను ఎంచుకునే అవ‌కాశం ప‌న్ను చెల్లింపుదారుల‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే కొత్త ప‌న్ను విధానం ఎంచుకుంటే చాలావ‌ర‌కు ఆదాయ ప‌న్ను మిన‌హాయింపులు కోల్పోతారు, కానీ ప‌న్ను త‌క్కువ‌గా ఉంటుంది. అదే పాత విధానంలో అయితే వివిద ప్ర‌యోజ‌నాలు, మిన‌హాయింపులు ఉంటాయి, కానీ ప‌న్నులు అధికంగా ఉంటాయి. అయితే అన్నింటిని ప‌క్క‌న పెడితే ఎన్‌పీఎస్‌లో మాత్రం చందాదారుల‌కు మరో అద‌న‌పు ప్ర‌యోజ‌నం ఉంది.
అదేంటంటే..కొత్త ప‌న్ను విధానం ఎంచుకున్న‌ప్ప‌టికీ చందాదారులు ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్ 80 ఛ్ఛ్డ్ (2) కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే ఎన్‌పీఎస్ ఖాతాలో త‌మ సంస్థ చేసిన వాటాపై ఈ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంద‌ని గుర్తుంచుకోవాలి.

* ఈ మధ్యే ఐపీవోతో దుమ్మురేపిన ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. మరో కొత్త మెంబర్‌షిప్‌ ప్లాన్‌తో రాబోతోంది. అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డెలివరీ.. నో సర్జ్‌ ఫీ.. నో డిస్టెన్స్‌ ఫీ.. అంటూ ముందుకొస్తోంది. ఈ మెంబర్‌షిప్‌ ప్లాన్‌కు జొమాటో ప్రో ప్లస్‌ అని నామకరణం చేసింది. అయితే, పరిమిత కాలం పాటు పరిమిత సంఖ్యలోనే ఈ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

* వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఈ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి.. తాజా టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో మెరిసింది. ఈ విజయంతో కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ట్విటర్‌ యూజర్‌ ఆసక్తికరంగా స్పందించాడు. సింధు గెలుపునకు బహుమానంగా.. మహింద్రా కంపెనీ రూపొందించిన థార్‌ వాహనాన్ని ఆమెకు బహుమానంగా ఇవ్వాలని కోరాడు. తన కోరికను తెలియజేస్తూ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్రాను తన పోస్టుకు ట్యాగ్‌ చేశాడు. ఆ పోస్టుపై ఆనంద్‌ మ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇప్పటికే సింధు గ్యారేజ్‌లో ఓ థార్‌ వాహనం పార్క్‌ చేసి ఉంది’ అని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌ 2016లో పతకాలు సాధించిన పీవీ సింధు, రెజ్లర్‌ సాక్షి మలిక్‌కు అప్పుడే మహింద్రా కంపెనీ థార్‌ వాహనాలను బహుమతిగా అందించింది. ఆ విషయాన్ని ఆనంద్‌ మహింద్రా చెప్పకనే చెప్పారు.