అమెరికాకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ హువావే ఎక్కడ చైనాకు చేరవేస్తుందోనన్నదే తమ భయమని అగ్రరాజ్యం పేర్కొంది. అమెరికాకు సంబంధించిన అత్యంత భద్రమైన సమాచారాన్ని హువావే చైనాకు అందిస్తుందన్న దానిపై యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో స్పందించారు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా హువావేపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. అమెరికాకు చెందిన ఏ కంపెనీ హువావేకు సాంకేతిక సహకారం అందించారని ఆదేశించింది. అయితే, ఆ తర్వాత 90రోజుల పాటు ఆంక్షలను సడలించింది. ‘హువావే చైనా ప్రభుత్వ కీలుబొమ్మ. వారి మధ్య బలమైన బంధం ఉంది’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంపియో ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా హువావేకు ఏ కంపెనీ సాయం చేయరాదని అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై ప్రశ్నించగా, ‘హువావే చైనా ప్రభుత్వంలో ఒక భాగం. అంతలా వారి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అమెరికన్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే’ అని పేర్కొన్నారు. చట్టాలకు అనుగుణంగా అమెరికా కంపెనీలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గౌరవించి అమలు చేస్తాయని అన్నారు. అంతేకానీ, ఏ అధ్యక్షుడు అమెరికన్ ప్రైవేటు కంపెనీలను మార్గనిర్దేశం చేయలేడని, చైనాలో అది మరింత దుర్లభమన్నారు. ‘ఒకవేళ హువావే దగ్గర ఉన్న టెక్నాలజీకి సంబంధించిన సమాచారాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ కావాలనుకుంటే వాళ్లు మరో ఆలోచన లేకుండా ఇచ్చేస్తారు. అంతలా వారి మధ్య బంధం ఉంది’ అని పాంపియో పేర్కొన్నారు.
హువావే చైనా కీలుబొమ్మ
Related tags :