* పెదకాకాని మండలం అగంతవరప్పాడులో 10 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం కేసులో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టివాసు సహా ఏడుగురిని మంగళవారం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రూ.కోట్ల విలువైన భూములు కొట్టేసేందుకు నిందితులు ప్లాన్ చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో సహా మరో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం మంగళవారం వారిని అరెస్ట్ చేశారు.
* బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్ హెడ్ వరుణ్ మాలి, పలువురు బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్ టీంను కోరారు.
* హుజూరాబాద్.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడే దృష్టి పెట్టాయి. ఉప ఎన్నికకు తెరలేపిన హుజూరాబాద్ రాజకీయాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమయ్యాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వెలువడవచ్చన్న సంకేతాలు అందడంతో పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. గత వారం రోజులుగా అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తులో మరింతగా మునిగిపోయాయి. అభ్యర్థుల అన్వేషణలో తీరిక లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ దూకుడు మరింత పెంచింది. పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే గట్టి పట్టుదలతో వ్యవహరిస్తోంది. నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పలు చర్యలు చేపడుతోంది. ‘దళిత బంధు’పథకానికి శ్రీకారం చుట్టడమే కాకుండా పైలట్ ప్రాజెక్టుగా హజూరాబాద్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలోకి ఇందుకోసం రూ.500 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులను వారు కలలో కూడా ఊహించని పదవులు వరిస్తున్నాయి. రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ టీఎస్ ఎస్సీడీసీఎల్ చైర్మన్ కాగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు.
* ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. 95శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించామని మంత్రి సురేష్ తెలిపారు.
* కేంద్రప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ఉపాధి హామీ నిధుల చెల్లింపుల అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు చెల్లింపులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశింది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
* జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీఐ కేసులు.. లేదంటే సీబీఐ, ఈడీ రెండు కేసులూ సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు సైతం విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరోవైపు ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లనూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
* కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండుతున్న వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కె.విజయానంద్ ప్రకటన విడుదల చేశారు.