* ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ atmలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.
* దాదాపు రూ.6 లక్షల కోట్ల అసెట్ మానిటైజేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం)’ కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం వెల్లడించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పైప్లైన్లు, పలు జాతీయ రహదారులు సహా ఇతర ప్రాజెక్టుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పవర్‌గ్రిడ్ పైప్లైన్లను మానిటైజ్ చేయడం కోసం ప్రత్యేక ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్)’ను నెలకొల్పినట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు నిర్వహణలో ‘పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)’ సత్ఫలితాలిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దీన్ని రైల్వేస్టేషన్లకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజా అసెట్ మానిటైజేషన్‌లో పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు.
* గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తాము సరిదిద్దామని ప్రధాని మోదీ అన్నారు. రెట్రోస్పెక్టివ్ (పాత తేదీల నుంచి వేసే పన్ను) పన్నునుద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. దీని రద్దు ద్వారా ప్రభుత్వంపై పరిశ్రమ వర్గాలకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. ఈ మేరకు సీఐఐ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, ఆర్థిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థ వేగం పుంజుకుంటోందని చెప్పారు.
* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా కవాసకి మోటార్(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నింజా 650, 2022 ఎడిషన్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.6.61 లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది.