* ఐటీ సొల్యూషన్ల సంస్థ ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సంబంధిత దరఖాస్తు పత్రాలను సెబీకి సమర్పించింది. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా ఈ సంస్థ రూ.800 కోట్లను సమీకరించాలని అనుకుంటోంది. ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ప్రకాశ్ జైన్ రూ.131.08 కోట్ల విలువైన షేర్లను, మంజులా జైన్ కుటుంబ ట్రస్టు రూ.91.77 కోట్ల వరకు, ప్రకాశ్ జైన్ కుటుంబ ట్రస్ట్ రూ.277.15 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్‌లో విక్రయించనున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూలో ఉద్యోగుల కోసం కూడా కొన్ని షేర్లను కేటాయించినట్లు సెబీకి దాఖలు చేసిన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను నిర్వహణ మూలధన అవసరాలకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించనుంది. సైబర్ భద్రతకు సంబంధించిన సొల్యూషన్లను ఇన్స్పిరా ఎంటర్ప్రైజ్ అందిస్తోంది.
* ఓలా విద్యుత్తు స్కూటర్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రజల ముందుకు రానే వచ్చింది. ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రివర్స్ మోడ్‌లో వస్తున్న అతికొద్ది ద్విచక్రవాహనాల్లో ఇదొకటి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 181 కి.మీ(ఎస్1 ప్రో) వరకూ ప్రయాణించవచ్చు. 115 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. బిల్ట్ ఇన్ స్పీకర్స్, స్మార్ట్ ఫోన్‌తో లాక్-అన్‌లాక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి.మరిన్ని ఫీచర్లు ఇవే..❂ నార్మల్, స్పోర్ట్, హైపర్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి.❂ 3 జీబీ ర్యామ్ ఆక్టాకోర్ చిప్ సెట్‌తో కూడిన ఏడు అంగుళాల తెర.❂ మొబైల్ అప్లికేషన్ ద్వారా లాక్-అన్‌లాక్‌ను ఆపరేట్ చేయొచ్చు.❂ స్క్రీన్‌లో ఉండే ‘మూడ్స్’ అనే ఫీచర్లో పలు రకాల ఒడోమీటర్ సెట్టింగ్‌లను పొందొచ్చు.❂ ‘బిల్ట్ ఇన్ స్పీకర్ల’తో ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు.❂ ఎస్1 ప్రో లో 3.97 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, ఎస్1లో 2.98 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని పొందుపరిచారు.❂ 50 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తున్నారు.❂ మూడు సెకన్లలో 40 కి.మీ/గం వేగాన్ని.. ఐదు సెకన్లలో 60 కి.మీ/గం. వేగాన్ని అందుకోగలదు.❂ ఎస్1 ప్రారంభ ధర రూ.99,999, ఎస్1 ప్రో ధర రూ.1,29,999. ఫేమ్ రాయితీ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. దిల్లీలో దీని ధర రూ.85,099, గుజరాత్లో రూ.79,999, మహారాష్ట్రలో రూ.94,999, రాజస్థాన్‌లో రూ.89,968.❂ పూర్తిగా ఎల్ఈడీ లైట్లు. మొత్తం 10 రంగుల్లో అందుబాటులో ఉంది.
* వాహన, పారిశ్రామిక బ్యాటరీల ఉత్పత్తి సంస్థ అమరరాజా బ్యాటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,885.86 కోట్ల ఆదాయాన్ని, రూ.123.94 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.1,151.04 కోట్లు, నికర లాభం రూ.62.68 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో ఈపీఎస్ రూ.7.26గా ఉంది. కొవిడ్ రెండో దశ, లాక్డౌన్ల నేపథ్యంలో ఉత్పత్తిపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ… అన్ని మార్కెట్ విభాగాలలో ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు అమరరాజా బ్యాటరీస్ వైస్ ఛైర్మన్, ఎండీ, సీఈఓ గల్లా జయదేవ్ అన్నారు. ఎనర్జీ స్టోరేజ్, ఇ-మొబిలిటీ విభాగాల్లో భవిష్యత్ అవకాశాల కోసం ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. లెడ్ ఆసిడ్ వ్యాపారంలో తగిన పెట్టుబడులు పెడుతూ.. ఉత్పత్తులను విస్తరించి, మార్కెట్ వాటాను పెంచుకుంటామని వివరించారు. వాహన, పరిశ్రమల విభాగాల్లో గిరాకీ స్థిరంగా కొనసాగుతోందని ఈ సందర్భంగా వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు, ఏఈఎంలలో వృధ్ధి నేపథ్యంలో ఆటోమోటివ్ బిజినెస్ ఆదాయం పెరిగింది. టెలికాం, యూపీఎస్ విభాగాలు రెండూ మంచి వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు. అమరరాజా వ్యవస్థాపక ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు ఆగస్టు 14న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఇక నుంచి అన్ని సంస్థాగత బాధ్యతలనూ గల్లా జయదేవ్ నిర్వహించనున్నారు.
* ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాలు నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ.4,335 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.497 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది దాదాపు 800 శాతం అధికం కావడం విశేషం. చమురు ధరలు దాదాపు రెట్టింపు కావడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బ్యారెల్ ముడి చమురును ఉత్పత్తి చేయడం, విక్రయించడం ద్వారా ఓఎన్జీసీ 65.59 డాలర్లను పొందింది. 2020 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో బ్యారెల్ ముడిచమురుపై కంపెనీ 28.87 డాలర్లు ఆర్జించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ ముడి చమురు ఉత్పత్తి దాదాపు 5 శాతం తగ్గి 5.4 మిలియన్ టన్నులుగా నమోదైంది. సహజవాయువు ఉత్పత్తి 4.3 శాతం తగ్గి 5.3 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. ఇందులో కంపెనీ నిర్వహిస్తున్న క్షేత్రాల నుంచి 4.6 మిలియన్ టన్నులను, మరో 0.55 మిలియన్ టన్నులను ఇతర భాగస్వాముల సంయుక్త సంస్థలతో కలిసి ఉత్పత్తి చేసింది. సొంత ఉత్పత్తి 4.2 శాతం, సంయుక్త సంస్థల ఉత్పత్తి 2.8 శాతం చొప్పున తగ్గాయి. ఓఎన్జీసీ సొంత గ్యాస్ ఉత్పత్తి 5.3% తగ్గి 5.1 బిలియన్ క్యూబిక్ మీటర్లుకు చేరగా, సంయుక్త సంస్థ క్షేత్రాల ఉత్పత్తి 0.2 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర పెరిగింది. స్థూల ఆదాయం 77% వృద్ధి చెంది రూ.23,022 కోట్లకు పెరిగింది.