NRI-NRT

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర వేడుకలు

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర వేడుకలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం నాడు అధ్యక్షులు భువనేశ్ బుజాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటి చైర్ శారద సింగిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించగా కృష్ణవేణి మల్లావజ్జల వ్యాఖ్యతగా వ్యవహరించారు. అనంతరం భువనేశ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, వక్తలను సభకు పరిచయం చేశారు. ఆటా కార్యాచరణ, సేవ కార్యక్రమాల గురించి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు డా. నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో, కవి గేయ రచయిత సాహితీవేత్త డా.నందిని సిద్ధారెడ్డి, తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు మసన చెన్నప్పలు పాల్గొని స్వాతంత్రోద్యమంలో, నేటి సమాజంలో సాహిత్యం పాత్ర, తెలుగు భాష ప్రాధాన్యత వంటి అనేక అంశాల గురించి మాట్లాడారు.

డా. నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తెలుగు భాష పూర్తిగా కనుమరుగు కాకముందే ఈ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని. ఆంగ్ల మాధ్యమంలో చదువు ఉన్నప్పటికీ తెలుగుని తప్పనిసరిగా ఒక భాషగా పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ సంస్కృతం తెలుగు పక్కపక్కనే పెట్టడం సమంజసం కాదని తెలుగు భాషకు ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని ఇందుకోసం తెలుగు భాషాభిమానులు, మేధావులు అందరూ తెలుగు భాషను కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు.

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ వందేమాతరం నినాదం త్రివర్ణ పతాకం స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాయని, ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించాయి అని ఈ తరం కూడా దేశం పట్ల, తెలుగు భాష పట్ల సాహిత్యం పట్ల అభిమానాన్ని, చైతన్యాన్ని కూడా కలిగి ఉండాలని అన్నారు.

మసన చెన్నప్ప మాట్లాడుతూ తెలుగు భాష ఎప్పటికి సుసంపన్నంగా ఉంటుంది అని అలా ఉండడానికి విశ్రాంత తెలుగు అధ్యాపకులు, భాష అభిమానులు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అలా జరిగినప్పుడు తెలుగు భాష ఎప్పటికీ అంతరించిపో దు అనే ఆశాభావం వ్యక్తపరిచారు.

కార్యక్రమంలో గాయని అనన్య పెనుగొండ ఆలపించిన జాతీయ గీతం, ఇమిటేషన్ రాజు మిమిక్రీ, రాఘవ ఫ్లూట్, కౌండిన్య వయొలిన్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ATA 2021 Independence Day Lakshmi Parvathi