Business

భారీగా పెరిగిన పసిడి ధర-వాణిజ్యం

భారీగా పెరిగిన పసిడి ధర-వాణిజ్యం

* బంగారం ధర రోజు రోజుకి పైకి పరిగెడుతుంది. పసిడి రేటు క్రమ క్రమంగా పైకి కదులుతోంది. బంగారం ధర నేడు కూడా పరుగులు పెట్టింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు. పసిడి ప్రేమికులకు ఇది చేదు వార్తా అని చెప్పుకోవాలి. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ జేవేల్లెరి మార్కెట్లో ఆగస్టు 11న రూ.46,219గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేటి వరకు సుమారు రూ.800 పెరిగి రూ.47,039కు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.43,088కు చేరుకుంది.

* భార‌త్ 75వ స్వాతంత్ర్య దినోత్సావాన్ని ఘ‌నంగా జ‌రుపుకొన్న సంద‌ర్భంగా భార‌తీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వివిధ రిటైల్ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజ‌లను ర‌ద్దు చేసింది. దీంతోపాటు వ‌డ్డీ రేట్ల‌ను కూడా త‌గ్గించింది.

* టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ(డబ్ల్యూపీఐ) జులైలో స్వల్పంగా తగ్గి 11.16 శాతానికి పరిమితమైంది. అయితే, వరుసగా నాలుగో నెలా ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదుకావడం గమనార్హం. 2020 జులైలో డబ్ల్యూపీఐ -0.25 శాతంగా ఉంది. ఈ ఏడాది మేలో ఇది రికార్డు స్థాయిలో గరిష్ఠంగా 12.94 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్‌లో 3.09 శాతంగా ఉండగా.. జులైలో అది సున్నా శాతానికి పరిమితమవడం గమనార్హం. ఉల్లి ధర పెరిగినప్పటికీ.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గడం విశేషం. ఉల్లి ధరల ద్రవ్యోల్బణం 72.01 శాతానికి చేరింది. ముడి చమురు, సహజవాయు విభాగాల ద్రవ్యోల్బణం 36.34 శాతం నుంచి పెరిగి 40.28 శాతానికి పరిమితమైంది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణ రేటు జులైలో 11.20 శాతంగా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 10.88 శాతంగా ఉంది.

* తూర్పు ఆసియాలోని ఆరు దేశాలను కలుపుతూ వేల మైళ్లు సముద్రగర్భంలో ఇంటర్నెట్ కేబుల్ వేయడానికి గూగుల్ కొత్త ప్రాజెక్టు చేపట్టింది. “ఆప్రికాట్” అని పిలువబడే ఈ ప్రాజెక్ట్ జపాన్, తైవాన్, గువామ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, సింగపూర్ దేశాలను అనుసంధానం చేస్తుంది. ఆప్రికాట్ ప్రాజెక్టులో భాగంగా సముద్రగర్భంలో 12,000 కిలోమీటర్లు (7,456 మైళ్ళు) కేబుల్ వేయనున్నట్లు గూగుల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ వ్యవస్థ 2024లో అందుబాటులోకి వస్తుంది అని తెలిపింది. ఫేస్‌బుక్ కూడా కేబుల్ వ్యవస్థకు పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. అలాగే, ప్రాంతీయ టెలికామ్ ప్రొవైడర్ల నుంచి కూడా గూగుల్ నిదులు సేకరిస్తుంది.

* ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన కస్టమర్ల కోసం అమెజాన్‌ ఇండిపెండెన్స్‌ సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్‌ తన కస్టమర్లకోసం మరో సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్‌ మొబైల్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరిట సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై ఇతర మొబైల్‌ యాక్సెసరీలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది.

* ఈ వారం లాభాలతో మార్కెట్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల దిశగా ప్రయాణించిన మార్కెట్‌ ఆ తర్వాత పుంజుకుంది. మరోసారి ఇన్వెస్టర్లు మార్కెట్‌పై నమ్మకం చూపించడంతో పాటు హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ తగ్గుముఖం పట్టిందంటూ వార్తలు వెలువడంతో మార్కెట్‌ లాభాల్లోకి వచ్చింది. ద్రవ్యోల్బణ ‍ ప్రమాదం లేదని తేలడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.