Movies

హిందీ వెబ్‌సిరీస్‌లో వెంకీ

హిందీ వెబ్‌సిరీస్‌లో వెంకీ

వెంకటేష్‌ ఓటీటీ వేదికల వైపు అడుగులు వేస్తున్నారా? ఓ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకుల్నీ పలకరించనున్నారా? అవుననే సమాధానమిచ్చారు నిర్మాత సురేష్‌బాబు. ఇటీవల ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆయన.. వెంకటేష్‌ కొత్త ప్రాజెక్ట్‌ విషయమై పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. వెంకీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ హిందీ వెబ్‌సిరీస్‌ చేయనున్నారని స్పష్టత ఇచ్చారు. ఇందులో ఆయనతో పాటు రానా కూడా కలిసి నటిస్తారని వెల్లడించారు. చాలా విభిన్నమైన కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందనుందని, వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పారు. దీన్ని హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉంటుందా? యాక్షన్‌ కోణంలో సాగుతుందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు. వెంకటేష్‌ ప్రస్తుతం ‘దృశ్యం 2’, ‘ఎఫ్‌ 3’ సినిమాలతో బిజీగా ఉన్నారు.