Food

అన్నం తినగానే నిద్ర వస్తోందా?

అన్నం తినగానే నిద్ర వస్తోందా?

మనం పగటి వేళ ఆకలి కాగానే.. ఏమున్నది అని చూడకుండానే టిఫిన్‌ డబ్బాను ఖాళీ చేసేస్తుంటాం. ఆ తర్వాత టేబుల్‌పైకొచ్చి ఫైల్స్‌ ముందేసుకుని కూర్చునేసరికి నిద్ర (Rice & Drowsy) ముంచుకొస్తుంది. రేపటి నుంచి రైస్‌ తక్కువ తినాలి.. అని నిన్నటి మాదిరిగానే అనుకుంటుంటాం. అయితే, పనుల్లో పడిపోయి రేపటి గురించి మరిచిపోతుంటాం. అయితే, మనం పగటి వేళ అన్నం తినగానే నిద్ర ఎందుకు ముంచుకు వస్తుంది..? అలా నిద్ర రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..? అనే సందేహాలు దాదాపు ప్రతీ ఒక్క ఉద్యోగిని ముంచెత్తుతుంటాయి. అన్నంలో 75 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పగటి వేళ అన్నం తినగానే మనకు నిద్ర ముంచుకొచ్చేలా చేయడంలో రైస్‌లోని కార్బోహైడ్రేట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం తిన్న తర్వాత బియ్యంలోని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. గ్లూకోజ్‌కు ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ పెరిగిన తర్వాత, ట్రిప్టోఫాన్ యొక్క అవసరమైన కొవ్వు ఆమ్లాలు రావడానికి మెదడును ప్రేరేపిస్తుంది. ఆ ప్రక్రియ మెలటోనిన్, సెరోటోనిన్ పెరగడానికి కారణమవుతుంది. ఇవే మనకు మగతని కలిగించే హార్మోన్లు. అన్నం తిన్న తర్వాత నాడీ వ్యవస్థ ప్రతిస్పందన శరీరాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థ జీర్ణక్రియ పైనే దృష్టి పెడుతుంది. ఫలితంగా మనలో ఒకరకమైన మగత ఆవరించి మనల్ని నిద్రాదేవి ఒడిలోకి తీసుకెళ్తుంది.

పగటి పూట ఆన్నం తినగానే నిద్ర రాకుండా ఉండాలంటే.. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ల శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన పళ్లెంలో 50 శాతం కూరగాయలు, 25 శాతం ప్రోటీన్లు మిగతా 25 శాతం పిండి పదార్థాలు ఉండాలా ఆహారాన్ని సిద్ధం చేయాలి. కార్బోహైడ్రేట్లు మనకు మంచే చేస్తాయి. అవి మన శరీరాన్ని శక్తివంతం చేస్తాయి. అయితే, ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యవస్థలు నెమ్మదించి మనల్ని నిద్రకు దగ్గరగా తీసుకెళ్తాయి. అందుకని నిద్ర రాకండా ఉండాలంటే పగటి వేళ భోజనంలో తక్కువ మొత్తంలో అన్నం ఉండేలా చూసుకోవాలి. అన్నం తినగానే నిద్ర రాకుండా ఉండేందుకు మరో చిట్కా ఏంటంటే.. మన ఆహారం నిర్వహణ. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా చూసుకోవలి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తినేలా ప్లాన్‌ చేసుకోవాలి. గంటకు ఒకసారి ఏదైనా తినడం ద్వారా జీర్ణవ్యవస్థపై అదనపు భారం కూడా పడదు. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో భోజనం చేయడం వలన పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు శరీరానికి అందుతాయి. ఇవి రక్తంలో నేరుగా కలిసి నిద్రను ప్రేరేపించే హార్మోన్లు విడుదలకు కారణమవుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో విడుదల కాకుండా ఉండాలంటే తక్కువ మొత్తంలో భోజనం చేయాలి. ఇలా చేయడం వలన మనకు కావాల్సినంత మోతాదులో గ్లూకోజ్‌ విడుదలయ్యేందుకు తద్వారా మధుమేహం వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.