Health

మైగ్రెయిన్ నొప్పులకు పుదీనా ఛాయి

Mint tea helps in relieving from migrain attacks

తెల్లవారితే చాలు… తల ఓ వైపు అంతా పగిలిపోతున్నట్లు అనిపిస్తుంది. నుదుటి నుంచి కన్ను, చెంపల వరకు నొప్పి బాధిస్తుంది. ఏదీ తినాలనిపించదు.ఉత్సాహంగా అడుగు వేయాలనిపించదు. మధ్యాహ్నం అయ్యేసరికి నొప్పి దానంతటదే తగ్గినట్లుంటుంది. దీన్ని నివారించేందుకు ఏం చేయాలో చూడండి.ఒక వైపు వచ్చే నొప్పినే పార్శ్వపు నొప్పి లేదా మైగ్రేన్‌ అంటారు. మైగ్రేన్‌ అనేది గ్రీకు పదం. దీనికి అర్థం తలకు ఒకవైపు మాత్రమే నొప్పి రావడం. ఇది కొందరిలో తక్కువగా ఉంటే, మరికొందరిలో చాలా తీవ్రంగా రోజుల తరబడి బాధిస్తుంది.
***కారణాలు – లక్షణాలు
ఈ నొప్పికి తగిన కారణాలను వైద్య నిపుణులు ప్రత్యేకంగా నిర్ధరించలేదు. ఆహార, విహారపరమైన కారణాలతోపాటు కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా పార్శ్వపు నొప్పి రావొచ్చని అంటారు వైద్యులు.
* తలపై బాదుతున్నట్లుగా ఓ వైపు మాత్రమే నొప్పి బాధిస్తుంది.
* వికారం, వాంతులు ఉంటాయి.
* వాసనలు, వెలుగు, ధ్వనిని భరించలేకపోవడం
* చీకటి గదిలోనే విశ్రాంతి తీసుకోవాలనిపించడం
* ఈ నొప్పి రావడానికి ముందు కొందరిలో కళ్ల ముందు ఏదో వెలుగులా అనిపిస్తుంది. కళ్లు బైర్లు కమ్మినట్లు కూడా ఉంటుంది.
****ఇలా చేసి చూడండి…
రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర తప్పనిసరి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే దిశగా యోగా, ధ్యానం చేయాలి. తాడాసనం, ఏకపాదాసనం, మకరాసనం, శవాసనం వంటివాటిని సాధన చేయాలి. అలాగే…
* పార్శ్వపు నొప్పి లక్షణాలు కనబడగానే చెంచా గోరు వెచ్చని కొబ్బరి నూనెలో కాస్తంత కర్పూరం వేసి కరిగించాలి. ఈ నూనెను నుదురు, మెడకు రాసి మర్దన చేయాలి. అదే నూనెలో దూది ఉండను ముంచి ముక్కు దగ్గర పెట్టుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. కర్పూరం ప్రభావం మెదడుపై పడి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
* శొంఠి కొమ్ముని పాలల్లో నూరి ఆ మిశ్రమాన్ని మూడు లేదా నాలుగు చుక్కలు ముక్కులో వేసినట్లైతే పార్శ్వపునొప్పి పెరగకుండా అదుపులో ఉంటుంది.
* పుదీనా ఆకులను టీ లా కాచి, వేడివేడిగా తాగితే నొప్పి అదుపులోకి వస్తుంది.
* చందనం, యష్టిమధు (అతి మధురం), వట్టివేళ్లు… ఈ మూడింటినీ నీళ్లతో నూరి నుదుటిపై లేపనంలా రాసుకుంటే పార్శ్వపునొప్పి తగ్గుతుంది.
***ఏం చేయాలంటే…
ఎటువంటి సమస్యకైనా ముందస్తు జాగ్రత్తలు ఎంతో మేలు చేస్తాయి. మైగ్రేన్‌ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఈ నొప్పి ఎటువంటి సమయంలో, ఏ కారణాల వల్ల వస్తుందో గుర్తించగలగాలి. వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, నూనెలో వేయించిన పదార్థాలు, రసాయనాలను కలిపి, నిల్వ ఉంచే సాస్‌లు, రెడీమెడ్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అలాగే నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, పుల్లని పండ్లు కూడా పార్శ్వపు నొప్పికి కారణాలు కావొచ్చు.