Editorials

ఈడీ-సీబీఐల పనితీరుపై జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి

ఈడీ-సీబీఐల పనితీరుపై జస్టిస్ ఎన్.వి.రమణ అసంతృప్తి

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అహసనం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జ్‌షీట్లు దాఖలు చేయకపోవడానికి గల కారణాలు చెప్పలేని దర్యాప్తు సంస్థల(ఈడీ, సీబీఐ) తీరుపై అసంతృప్తి ప్రకటించింది. మనీలాండరింగ్‌ వంటి కేసుల్లో ఛార్జ్‌షీట్లు లేకుండా కేవలం ఆస్తులు జప్తు చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించింది.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్‌ క్యూరీగా ఉన్న సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా తాజాగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. మనీలాండరింగ్‌ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది. 58 పెండింగ్‌ కేసుల్లో జీవిత ఖైదు పడే అవకాశముందని పేర్కొంది. 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది.

ఈ నివేదికను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం దర్యాప్తు సంస్థల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది చాలా విచారకరం. నివేదిక అసంపూర్తిగా ఉంది. 10-15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ కనీసం అభియోగాలు కూడా నమోదు చేయలేదు. ఛార్జ్‌షీటు దాఖలు చేయడానికి కారణాలు కూడా చెప్పలేదు. మేం దర్యాప్తు సంస్థలను నిలదీయడం లేదు. న్యాయమూర్తుల లాగా వారికీ అధిక భారం ఉంది. కాబట్టే సంయమనం పాటిస్తున్నాం. మనీలాండరింగ్‌ కేసుల్లో చాలా వాటిల్లో ఈడీ కేవలం ఆస్తులు జప్తు చేయడం మినహా ఎలాంటి దర్యప్తు చేపట్టలేదు. ఛార్జ్‌షీట్లు లేకుండా ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

దీనికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బదులిస్తూ.. చాలా కేసుల్లో దర్యాప్తులపై హైకోర్టులు స్టే విధించాయని, అందుకే ఆలస్యమవుతున్నాయని అన్నారు. అయితే ఎస్‌జీ సమాధానం పట్ల సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. కేవలం 8 కేసుల్లో మాత్రమే కోర్టుల నుంచి స్టే ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను అలాగే వదిలేయడం సరికాదని, కనీసం ఛార్జ్‌షీట్లయినా దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. కేసుల విచారణలో మానవ వనరుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారిందని సీజేఐ ఎన్‌.వి. రమణ అభిప్రాయపడ్డారు. జడ్జిల సంఖ్య, మౌలిక సదుపాయాలు సమస్యగా మారుతున్నాయని అన్నారు. దీన్ని పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు.