DailyDose

గేదె కళేబారానికి ఆటో ఢీకొని అయిదుగురు మృతి-నేరవార్తలు

గేదె కళేబారానికి ఆటో ఢీకొని అయిదుగురు మృతి-నేరవార్తలు

* కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు రెండో రోజు ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకులో తనఖా పెట్టిన షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలను సీసీఎస్ పోలీసులు పార్థసారథి నుంచి సేకరించినట్లు సమచారం. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకులో తనఖా పెట్టి రూ.137 కోట్లను పార్థసారథి రుణంగా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26, 27 తేదీల్లో పార్థసారథిని ప్రశ్నించినప్పటికీ పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో పోలీసులు నాంపల్లి న్యాయస్థానం అనుమతితో మరోసారి రెండు రోజుల కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

* ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఎక్కిన ఆటోను బోల్తా పడకుండా డ్రైవర్‌ నియంత్రిస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ దాన్ని ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరగడానికి ముందు రోడ్డు దాటుతున్న గేదెను మరో టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో గేదె మృతిచెందింది. ఈ క్రమంలో ఆ తర్వాత వచ్చిన ఆటో గేదె కళేబరాన్ని గమనించకుండా దానిపైకి ఎక్కింది.

* వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్‌ వాగు దాటబోతూ దాని ఉద్ధృతికి కారులో కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించి రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి మృతదేహాలను గుర్తించారు. డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, బాలుడు త్రిషాంత్‌ మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మరోవైపు శంకర్‌పల్లి మండలం కొత్తపల్లి వాగులో కోట్టుకుపోయిన కారులో ఉన్న వృద్ధుడు వెంకటయ్య(70) మృతదేహం కూడా లభ్యమైంది.

* మెదక్‌ జిల్లా బొల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాళ్లతో కట్టుకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో దూకారు. వారిలో భర్త శ్రీనివాస్ (40), కుమార్తె కృతి (11) మృతి చెందారు. శ్రీనివాస్‌ భార్య లావణ్యను గ్రామస్థులు కాపాడారు. వెంటనే ఆమెను మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌ బొల్లారంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.