* తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్ని పెంచనున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సోమవారం ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబరు నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అయితే, ధరలు ఎంతమేర పెరగనున్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు ఎగబాకడమే ధరల పెంపునకు కారణంగా వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్‌ని బట్టి ధరల పెంపు మారుతుందని తెలిపింది. ఈ సంవత్సరంలో జనవరి నుంచి మారుతీ ధరలు పెంచడం ఇది నాలుగోసారి. జనవరి 18న గరిష్ఠంగా కొన్ని మోడళ్లపై రూ.34,000 వరకు, ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూం ధరలపై 1.6 శాతం పెంపు అమలు చేసింది. జులైలోనే స్విఫ్ట్ హాచ్‌బ్యాక్ సహా అన్ని సీఎన్‌జీ మోడళ్ల ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాల ధరలను మళ్లీ పెంచుతారో.. లేదో.. తెలియాల్సి ఉంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కనబరిచాయి. కీలక రంగాలు రాణించడం.. రిలయన్స్, ఎయిర్‌టెల్, మారుతీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దూసుకెళ్లడం మదుపర్లను ఉత్సాహపరిచాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి బలపడడం, ఎఫ్‌డీఐల వెల్లువ మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.27 వద్ద ముగిసింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) గాను ఆరో విడత సార్వభౌమ పసిడి బాండ్లు నేటి (ఆగస్టు 30) నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇష్యూ ధర రూ. 4,732. ఆన్‌లైన్ ద్వారా పసిడి బాండ్లను కొనుగోలు చేసే వారికి మరో రూ. 50 తగ్గింపు లభిస్తుంది. సెప్టెంబర్ 3 వరకు ఐదు రోజుల పాటు ఈ పసిడి బాండ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే వీటికి సంబంధించిన సర్టిఫికెట్లను సెప్టెంబరు 7న జారీ చేస్తారు. ఐదో విడత ఇష్యూ ధర రూ.4,790 పోలిస్తే ఈసారి ధర కాస్త తగ్గింది. ఒక గ్రాము యూనిట్‌గా పరిగణించి బంగారు బాండ్లలో పెట్టుబడి పెడతారు. కనీసం ఒక గ్రాము నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన ధర ఆధారంగా మదుపర్లు బాండ్లలో పెట్టుబడి పెట్టాలి. 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర సబ్‌స్క్రిప్షన్‌కు ముందు వారం చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి ధర నిర్ణయిస్తారు. ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది. అందువల్ల పెట్టుబడికి హామీ ఉంటుంది. బ్యాంకు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్ట్ ఆఫీసులు, అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్ఈ)ల వద్ద అందుబాటులో ఉంటాయి.
* దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.199 తగ్గి రూ.46,389కి చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,588 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడం, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ కాస్త బలపడటం దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
* ఉద్యోగుల వలసలు అధికం కావడం, సేవలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఏడాది పొడవునా ప్రెషర్స్ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్, పెర్సిస్టెంట్ వంటి కంపెనీలు ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నాయి.నిపుణుల కొరతతో సతమతమవుతున్న ఐటీ రంగం ఈ ఏడాది లక్షకు పైగా ఫ్రెషర్స్‌ను నియమించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకున్నాయి. గత కొన్నేండ్లుగా ట్రైనీల నియామకానికి ఏడాది ఆరంభంలో నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్‌ను నిర్వహిస్తున్న టీసీఎస్ ఈసారి ఏడాది పొడవునా హైరింగ్ చేపట్టేందుకు ప్రతి క్వార్టర్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తోంది.