చికెన్, మటన్, ఎగ్, మష్రూమ్..ఏ బిర్యానీకైనా హైదరాబాదే రాజధాని. ఫోర్బ్స్ రుచుల ర్యాంకింగ్‌లోనూ మనమే కింగ్! సీ ఫుడ్ లవర్స్ కోసం చేపలు, పీతలు, రొయ్యలతోనూ బ్రహ్మాండమైన బిర్యానీలు వండుతున్నారు బావర్చీలు. చికెన్, మటన్‌లకు తీసిపోకుండా నాన్‌వెజ్ ప్రియులు ఇష్టపడే రొయ్యల బిర్యానీ విశేషాలు..
బిర్యానీకి మసాలా ఆత్మ లాంటిది. రొయ్యల బిర్యానీలో వాడే మసాలా చాలా ప్రత్యేకం. సముద్ర జీవుల్లోంచి వచ్చే నీచు వాసనంతా పోయేలా ప్రత్యేకమైన దినుసులతో తయారు చేస్తారు. ఇది రొయ్యలతో పాటు అన్నానికీ కొత్త రుచినిస్తుంది.
సీ ఫుడ్ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోళ్లు సముద్రంలా ఊరిపోతాయి. ఆ జిహ్వ చాపల్యానికి ఆనకట్టలు వేయడానికి, జలాశయాల్లో దొరికే రకరకాల జీవులతో సరికొత్త వంటకాలు వండి వడ్డించాల్సిందే. రొయ్యలతోనూ కూర, పులుసు, వేపుడు, ఇగురు.. వంటివన్నీ వండుతారు పాకశాస్త్ర నిపుణులు. అయినా, తనివి తీరకపోతే రొయ్యల బిర్యానీ ఉండనే ఉంది.
తెలంగాణలో మంచినీటి రొయ్యలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి పరిమాణంలో చిన్న అయినా, రుచిలో మాత్రం మిన్న. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న టైగర్ రొయ్యలూ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. కానీ తెలంగాణ చెరువుల్లో విరివిగా పెరిగే చిట్టి రొయ్యలకే గిరాకీ ఎక్కువ.
రొయ్యలు బలవర్ధకమైనవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు పొందవచ్చు. రొయ్యల్లో క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2 ఉంటాయి. వీటిలోని ప్రత్యేక పోషకాలు, నిత్యం కంప్యూటర్లు ఉపయోగించే వారికి…కంటి అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఏ బిర్యానీ అయినా, వండే పద్ధతిలో పెద్దగా తేడా ఉండదు. అయితే రొయ్యల రుచి, వాసన వల్ల వంట మరింత ఘుమఘుమలాడుతుంది. అందుకే, ఏ రెస్టరెంట్‌కు వెళ్లినా ‘బాప్ ఆఫ్ బిర్యానీస్’ హోదా రొయ్యల పులావ్‌కే దక్కుతుంది.