Fashion

మెడ-వెన్ను-నడుము నొప్పికి మీ బ్రా కారణం కావచ్చు. సరైనవి ఇలా ఎంచుకోండి.

మెడ-వెన్ను-నడుము నొప్పికి మీ బ్రా కారణం కావచ్చు. సరైనవి ఇలా ఎంచుకోండి.

వక్షోజాలకు చక్కటి సపోర్ట్‌ని అందిస్తూనే.. ఎద అందాన్ని ఇనుమడింపజేయడంలో ‘బ్రా’ పాత్ర కీలకం! అయితే సుమారు 64 శాతం మంది మహిళలు తమ శరీరాకృతికి నప్పే బ్రా ఎంపిక చేసుకోవట్లేదని, మరో 24 శాతం మంది బ్రా సైజు విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా ధరించిన దుస్తులు సరిగ్గా ఫిట్‌ కాక అసౌకర్యం కలగడంతో పాటు.. మెడ నొప్పి, వెన్ను నొప్పి, నడుం నొప్పి.. వంటి సమస్యలు వేధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే బ్రాల ఎంపిక విషయంలో స్తనాల పరిమాణం, ఆకృతితో పాటు మనం ధరించే అవుట్‌ఫిట్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బ్రా రకాలేంటి? అవుట్‌ఫిట్‌కి నప్పేలా బ్రాలను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం రండి..బ్రాలను ఎంచుకునే విషయంలో ఏదో ఒకటిలే అన్న ధోరణే చాలామంది అమ్మాయిల్లో కనిపిస్తుంటుంది. అయితే ఈ అశ్రద్ధ వల్లే ఇటు అసౌకర్యం, అటు పలు అనారోగ్యాలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అదే.. వక్షోజాల పరిమాణం, వేసుకునే దుస్తులను బట్టి వీటిని ఎంచుకుంటే అటు డ్రస్సూ శరీరాకృతికి ఫిట్‌ అవుతుంది.. ఇటు కంఫర్టబుల్‌గానూ ఉంటుంది. అలాంటి బ్రా రకాలే ఇవి!

*** టీ-షర్ట్‌ బ్రా
పేరుకు తగినట్లుగానే టీషర్ట్‌, ఇతర బిగుతైన దుస్తులు ధరించినప్పుడు ఇది చక్కగా నప్పుతుంది. అయితే చాలామంది బిగుతుగా ఉండే దుస్తులు ధరించినప్పుడు లోదుస్తులు, వాటి అంచులకు ఉండే స్ట్రాప్స్‌ అచ్చులు బయటికి కనిపిస్తాయేమోనని అసౌకర్యంగా ఫీలవుతుంటారు. టీ-షర్ట్‌ బ్రాను ఎంచుకుంటే ఆ భయం అక్కర్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీని అంచులకు ఎలాంటి స్ట్రాప్స్‌, లేస్‌లు ఉండవు. బ్రా అంతా ఒకే క్లాత్‌తో తయారవుతుంది కాబట్టి.. కంఫర్టబుల్‌గా దీన్ని ధరించచ్చు. అలాగే దీనికి వక్షోజాల దగ్గర రెండు కప్స్‌ అమరి ఉంటాయి. ఇవి స్తనాలకు చక్కటి సపోర్ట్‌ని అందిస్తూనే.. అవి తీరైన ఆకృతిలో కనిపించేలా చేస్తాయి.

*** లాంగ్‌ లైన్‌ బ్రా
పెళ్లి, పార్టీలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో నాజూకైన శరీరాకృతితో కనిపించాలనుకోవడం కామన్‌! అందుకు అనుగుణంగానే మనం ధరించే అవుట్‌ఫిట్స్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాం. పొట్ట దగ్గర్నుంచి నడుం వరకు బిగుతుగా, చక్కటి షేప్‌లో ఉండేలా దుస్తుల్ని సెట్‌ చేయించుకుంటాం. ఇలాంటి దుస్తుల కోసం లాంగ్‌ లైన్‌ బ్రా చక్కగా నప్పుతుందంటున్నారు నిపుణులు. సాధారణ బ్రా లాగే ఉండే ఇది పై నుంచి నడుం వరకు విస్తరించి ఉంటుంది. పైగా సాగే గుణం ఉన్న క్లాత్‌తో దీన్ని తయారుచేయడం వల్ల అసౌకర్యానికి గురవ్వాల్సిన పని లేదు. దీన్ని ధరించి.. ఆపై అవుట్‌ఫిట్‌ వేసుకోవడం వల్ల తీరైన ఆకృతిలో కనిపించేయచ్చు. అనార్కలీ, లాంగ్‌ ఫ్రాక్స్‌, కుర్తీస్‌తో పాటు వెయిస్ట్‌ లెంత్‌ బ్లౌజ్‌కు జతగా కూడా దీన్ని ఎంచుకోవచ్చు.

*** పుషప్‌ బ్రా
కొంతమంది వక్షోజాలు వదులుగా, సాగినట్లుగా కనిపిస్తుంటాయి. దీనివల్ల శరీరాకృతి, అందం దెబ్బతింటాయి. ఇలాంటి వారు పుషప్‌ బ్రాను ఎంచుకొని కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చు. దీనికి ఉండే ప్రత్యేక ప్యాడ్స్ స్తనాలకు సపోర్ట్‌ని అందించి నిలిపి ఉంచుతాయి. స్తనాల పరిమాణం తక్కువగా ఉండి అసౌకర్యానికి గురయ్యే వారు ఈ తరహా బ్రాను ఎంచుకొని సౌకర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక ఇవి ఎలాంటి అవుట్‌ఫిట్‌పైకైనా ఇట్టే నప్పుతాయి. అయితే వక్షోజాల పరిమాణం పెద్దగా ఉండే వాళ్లు మాత్రం పుషప్‌ బ్రాకు దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటికి ఉండే ప్యాడ్స్‌ స్తనాల్ని పైకి నెట్టడం వల్ల లుక్‌ ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఈ బ్రాను ఎంచుకోవాలా, వద్దా అనేది నిర్ణయించుకోవాలి.

*** స్ట్రాప్‌లెస్‌ బ్రా
కొంతమంది ఫ్యాషన్‌ ప్రియులకు ఆఫ్‌-షోల్డర్‌, స్ట్రాప్‌లెస్‌.. వంటి దుస్తులు ధరించడం అలవాటుంటుంది. అలాంటి వారు సాధారణ బ్రాను ఎంచుకోలేరు. కాబట్టి ఈ తరహా అవుట్‌ఫిట్స్‌కి స్ట్రాప్‌లెస్‌ బ్రా నప్పుతుందంటున్నారు నిపుణులు. అయితే దీనికి భుజాలపై నుంచి స్ట్రాప్స్‌ లేకపోయినా.. కింది భాగంలో సిలికాన్‌/రబ్బర్‌తో చేసిన బ్యాండ్‌ ఒకటి ఉంటుంది. ఇది శరీరానికి పట్టినట్లుగా ఉండి.. బ్రా జారిపోకుండా కాపాడుతుంది. ఇందులోనూ ప్యాడెడ్‌/నాన్‌ ప్యాడెడ్‌.. రెండు రకాలుగా లభిస్తున్నాయి. స్తనాల ఆకృతిని బట్టి దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే.. వక్షోజాలు చిన్నగా ఉన్న వారు ప్యాడెడ్‌, పెద్దగా ఉన్న వారు నాన్‌-ప్యాడెడ్‌ ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది.

*** మల్టీపర్పస్‌ బ్రా
పేరుకు తగినట్లుగానే దీన్ని విభిన్న అవుట్‌ఫిట్స్‌ పైకి ధరించచ్చు. Convertible Bra గా పిలిచే దీనికి అనుసంధానమై ఉన్న స్ట్రాప్స్‌ని స్ట్రెయిట్‌గా, క్రిస్‌క్రాస్‌గా.. ఇలా ఎలాగైనా ధరించచ్చు.. ఒకవేళ ఆఫ్‌-షోల్డర్‌, స్ట్రాప్‌ లెస్‌ వంటి దుస్తులు ధరించినప్పుడు ఈ బ్రా స్ట్రాప్స్‌ తొలగించి కూడా వేసుకోవచ్చు. ఇలా మన వార్డ్‌రోబ్‌లో ఈ బ్రా ఒక్కటి ఉంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. అయితే ఇందులోనూ ప్యాడెడ్‌, నాన్‌ ప్యాడెడ్, లేస్‌ ఉన్నవి/లేనివి కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మీకు నప్పిన, నచ్చిన బ్రాను ఎంచుకుంటే సౌకర్యవంతంగా మెరిసిపోవచ్చు.. ఎద సౌందర్యాన్నీ ఇనుమడింపజేసుకోవచ్చు.

*** ఇవి కూడా!
* కొత్తగా తల్లైన వారు తమ పిల్లలకు సౌకర్యవంతంగా పాలిచ్చేలా, స్తనాలకు చక్కటి సపోర్ట్‌ని అందించేలా ప్రస్తుతం విభిన్న రకాల మెటర్నిటీ బ్రాలు సైతం అందుబాటులో ఉన్నాయి.
* నడక, పరుగు, ఇతర వ్యాయామాలు చేసే క్రమంలో వక్షోజాల్ని పట్టి ఉంచేలా, సౌకర్యవంతంగా ఉండేందుకు విభిన్న రకాల స్పోర్ట్స్‌ బ్రాలు ప్రస్తుతం జిమ్‌ ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి.
* బ్యాక్‌లెస్‌, బ్యాక్‌ ఓపెన్‌ ఉన్న బ్లౌజులు ధరించినప్పుడు, అవుట్‌ఫిట్స్‌కి వీపు భాగంలో లేస్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేయడం/ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే క్లాత్‌ని జతచేయడం.. ఇలాంటి సందర్భాల్లో స్టిక్‌ ఆన్‌ బ్రాలు చక్కగా నప్పుతాయి. వీటికి ఎలాంటి స్ట్రాప్స్‌, లేస్‌లు ఉండవు. కేవలం వక్షోజాలను పైకి నెడుతూ స్టిక్‌ చేసుకునే విధంగా వీటిని రూపొందించారు డిజైనర్లు.
* ప్యాడెడ్‌ బ్రాలు ధరించడం కొంతమందికి ఇష్టముండదు. మీరూ అంతేనా? అయితే నాన్‌ ప్యాడెడ్‌ బ్రాలు ఎంచుకోవచ్చు. ఇవి వక్షోజాలు/నిపుల్స్‌ ఆకృతిని సహజసిద్ధంగానే ఇనుమడింపచేస్తాయి.
* ఇక లో-నెక్‌, ప్లంజింగ్‌ నెక్‌లైన్‌, వి-నెక్‌.. వంటి దుస్తులు ధరించినప్పుడు ప్లంజ్‌ బ్రా, బ్రాలెట్‌.. వంటివి నప్పుతాయి.
ఇలా మనం ధరించే దుస్తులను బట్టి బ్రాను ఎంచుకుంటే అందం ఇనుమడిస్తుంది.. సౌకర్యవంతంగానూ ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇంకా మీకేవైనా సందేహాలున్నా, సలహాలు కావాలన్నా నిపుణుల్ని అడిగి తెలుసుకొని ఓ స్పష్టత తెచ్చుకోవచ్చు..!