NRI-NRT

తితిదేకు బోస్టన్ ప్రవాసుడు ఐకా రవి భారీ విరాళం

తితిదేకు బోస్టన్ ప్రవాసుడు ఐకా రవి భారీ విరాళం

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస అమెరికాకు చెందిన ఎన్నారై రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్‌లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా.. తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ ద్వారా విరాళం అందించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిసిన రామకృష్ణ ప్రసాద్‌ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. రవి ఐకా ఇప్పటికే పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్ల వరకు విరాళంగా అందించారని ధర్మారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు రవి ఐకా ముందుకొచ్చారని.. తొలి విడతగా రూ. 4.20 కోట్లు అందజేశారని వెల్లడించారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.