Politics

ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధులతో కుంభకోణం-తాజావార్తలు

ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధులతో కుంభకోణం-తాజావార్తలు

* ఏపీ సచివాలయంలో భారీ స్కామ్ ను గుట్టురట్టు చేసిన ఏసీబీ..పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి..50 మంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తింపు..ప్రజాప్రతినిధుల పిఏలు , అనుచరుల పాత్రపై ఆరా..కేసులో పలువురు నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ..

* తెలంగాణలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది. కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ (సీసీజీఆర్‌ఏ) కార్యాచరణ ప్రణాళికలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని డీహెచ్ డా. శ్రీనివాస్‌ను ప్రశ్నించింది.

* దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రజా ఉద్యమాలు జరగాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజాస్వామ్యానికి ఉన్న నాలుగు స్తంభాలను ప్రధాని నరేంద్రమోదీ ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షాలు నిర్వహించిన మహాధర్నాలో సీతారాం ఏచూరి మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమం మాదిరిగా పోరాటాలు జరపాలని.. రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

* తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని.. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తన ఇంటిపై తెరాస కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెరాసకు వత్తాసు పలికే అధికారులను గుర్తుపెట్టుకుంటామని.. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవన్నారు.

* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సర్వ దర్శనం టోకెన్లు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబరు 31 వరకు సర్వదర్శనం టోకెన్లను తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తేల్చింది. ఏపీ సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.117 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు.

* ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చెరకు రైతులు బంద్‌ నిర్వహించారు. పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు.

* నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశపరీక్షలకు మహిళల్ని అనుమతించడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళలకు దక్కాల్సిన హక్కుల్ని నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. మహిళలను ఎన్‌డీఏలోకి అనుమతించే అవకాశాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.

* కొవిషీల్డ్ టీకా రెండు డోసులు తీసుకున్న భారత ప్రయాణికుల క్వారంటైన్‌ నిబంధనల విషయంలో బ్రిటన్ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. తిరకాసు పెట్టింది. కొవిషీల్డ్‌ను ఆమోదించిన టీకాల జాబితాలో చేర్చుతూ తన ప్రయాణ నిబంధనలను సవరించింది. అయితే తమ సమస్య టీకాతో కాదని, టీకా ధ్రువపత్రంతో అంటూ చెప్పుకొచ్చింది. అందుకే కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉందని తాజాగా వెల్లడించింది.

* అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం తాము సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొంటున్న తాలిబన్లు.. అంతర్జాతీయ సమాజం గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతోన్న ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో తమ ప్రతినిధి ప్రసంగించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఐరాస చీఫ్‌కు లేఖ రాశారు

* ఐపీఎల్‌ రెండో దశలోనూ కరోనా కలకలం మొదలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడు నటరాజన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురుని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి ఈ రోజు ఉదయం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అందరికీ నెగిటివ్‌ వచ్చిందట. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌ యథావిధిగా కొనసాగుతుందని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఫైజర్‌, మోడెర్నా టీకాలు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి వీటిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దేశీయంగా తయారవుతోన్న వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు తక్కువ ఖర్చులోనే లభ్యమవుతుండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తోన్న భారత్‌లో ఈ రెండు టీకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అంశం గతకొంతకాలంగా హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ ఎన్నికపై ఎప్పుడూ లేనంతగా చర్చ సాగుతోంది. అక్టోబర్‌ 10న జరగనున్న ఈ ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులుగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించారు. సెప్టెంబరు 23న విష్ణు తన ప్యానల్‌ సభ్యుల వివరాల్ని వెల్లడించనున్నారని సమాచారం. ‘మా’కి ప్రత్యేక భవనం ఎజెండాతో రాబోతున్న విష్ణు.. తన ప్యానల్‌లో ఎవరికి అవకాశం ఇస్తారోనని అటు చిత్ర పరిశ్రమలో, ఇటు సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, జనరల్‌ సెక్రటరీ పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.