NRI-NRT

అమెరికాకు మోడీ పయనం

అమెరికాకు మోడీ పయనం

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయల్దేరారు. కొద్ది క్షణాల క్రితమే మోదీ న్యూఢిల్లీ నుంచి అగ్రరాజ్యానికి పయనమయ్యారు. కాగా.. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌‌ను గురువారం వాషింగ్టన్‌లో కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ ఈ నెల 24న వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. అమెరికాతో భారత ద్వైపాక్షిక సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, రక్షణ రంగాలు, అఫ్ఘానిస్థాన్‌లోని పరిస్థితులు, ఉగ్రవాద నిరోధం, ఇండో-పసిఫిక్‌, వాతావరణ మార్పులు వంటి అంశాలపై బైడెన్‌తో మోదీ చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే, ఈ నెల 24నే వాషింగ్టన్‌లో చతుర్భుజ భద్రతా కూటమి(ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికా కూటమి) సదస్సులోనూ మోదీ పాల్గొననున్నారు. అనంతరం ఈ నెల 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలోనూ ఆయన ప్రసంగించి.. ఆదివారం రోజు భారత్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు