* జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. మంగళవారం మరోసారి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, కక్ష కట్టి మాట్లాడటం సరికాదు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి గుర్తులేదా? ఒకసారి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ జరుగుతుంటే రాత్రి షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా నేను సాయంత్రం 6 గంటలకు వెళ్లిపోతా. పెద్ద హీరో కదాని రాత్రి 9గంటల వరకూ వేచి చూసినా ఆయన రాలేదు. రాత్రి 10.30గంటలకు ఇంట్లో భోజనం చేస్తుంటే ఆయన ఫోన్ చేశారు. ‘ఏవండీ మేము పిచ్చోళ్లమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు?’ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. నాకు కోపం వచ్చింది. ‘మీరు 10గంటలకు వస్తే, మేము అప్పటివరకూ ఉండాలా? నేను కూడా ఆర్టిస్ట్‌నే. 9గంటల వరకూ వేచి చూశా. నువ్వు రాలేదు’ అని నేను కూడా కాస్త గట్టిగానే మాట్లాడా! ఆ తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు. నామీద ఆయనకు పీకల వరకూ కోపం ఉంది. అయితే, నేను మాత్రం ఆయనపై ఎప్పుడూ కోపం పెట్టుకోలేదు. 30ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను జగన్‌గారి అభిమానిని. ఆయనను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. మీ అభిమానుల్లా నేను అసభ్య పదజాలంతో మాట్లాడను. ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడతా! నేను మిమ్మల్ని ప్రశ్నించినందుకు నిన్న రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయి’’
* చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పాడి రైతులకు ప్రయోజనం కలిగించే సహకార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. దీనికోసం ఆక్వా హబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తీసుకువస్తున్నట్లు సీఎం ప్రకటించారు. జగనన్న అమూల్ పాల వెల్లువ, మత్స్య శాఖలపై అధికారులతో జగన్ సమీక్షించారు. పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు, అమూల్ ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు.
* తెలంగాణలో గతేడాది సెప్టెంబర్- అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రైతులకు మూడు నెలల్లో ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది. రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివసిస్తున్న ప్రగతి భవన్ అవినీతి భవన్‌గా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా సీఎం కేసీఆర్‌కు పేరుందని.. ఇది నిజమో.. కాదో.. నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
* పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాజీపడితే వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని పేర్కొన్నారు. పంజాబ్ భవిష్యత్తు, సంక్షేమం అజెండాలో మాత్రం రాజీపడే ప్రసక్తేలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టంచేశారు.
* అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భవిష్యత్తులో ఫోన్ చేస్తారా..? అనే విషయాన్ని చెప్పలేమని శ్వేత సౌధ సిబ్బంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య అత్యంత ప్రాధాన్యమున్న అంశం ఉంటేగానీ జోబైడెన్ నుంచి కాల్ వెళ్లదని వివరించారు. ఇటీవల అమెరికన్ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జో ఫోన్ చేయని విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు.
* ఏపీలో సినీ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం మంచి చేయాలని చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బంది. ఆయనను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. పవన్.. సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారు. పవన్ లాంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా వారే భావిస్తున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఈ విధానంతో పారదర్శకత సాధ్యం. సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమే.
* నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసులపై దర్యాప్తు పూర్తయిందా? కొనసాగుతోందా తెలపాలని ఈడీకి న్యాయస్థానం ఆదేశించింది. పెన్నా ఈడీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. ఇండియా సిమెంట్స్ కేసులో జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ జరిగింది. డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు ఈడీ గడువు కోరింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ ఛార్జ్‌షీట్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసుల విచారణ అక్టోబరు 5కి వాయిదా పడింది.
* కరోనా చికిత్స కోసం తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా అడ్డంకులు సృష్టించారని, గ్రామస్థులంతా ఆ సమయంలో అండగా నిలవడం వల్లే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారని ఆయుర్వేద నిపుణుడు బి.ఆనందయ్య తెలిపారు. యాదవ మహాసభ సమితి సోమవారం విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించాల్సి ఉందన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ యాదవులకు రాజ్యాధికారమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
* ఇఫ్లూ(ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో బోధనా సిబ్బంది నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఇఫ్లూకి హైకోర్టు అనుమతిచ్చింది. గతేడాది 58 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఇఫ్లూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఓబీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని బీసీ కమిషన్‌లో దాసోజు శ్రవణ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇఫ్లూ నియామక ప్రక్రియపై గతంలో జాతీయ బీసీ కమిషన్ స్టే ఇచ్చింది. జాతీయ బీసీ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఇఫ్లూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. యూనివర్సిటీలో నియామకాలను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. కేసు పూర్వాపరాల జోలికి ఇక్కడ వెళ్లడంలేదని తెలిపింది. ‘‘ఓబీసీ రిజర్వేషన్ల వివాదంపై మేం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంలేదు. రిజర్వేషన్ల వివాదంపై విచారణ ప్రక్రియ కొనసాగించవచ్చు’’ అని ధర్మాసనం తెలిపింది. నియామకాల్లో అభ్యంతరాలుంటే అభ్యర్థులు సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చని తెలిపింది.
* తెలుగు సంస్కృత అకాడమీ తన బ్రాండ్ ఇమేజ్ నిలుపుకుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ ఇంటర్ పుస్తకాలను సురేశ్ విడుదల చేశారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు ముద్రించినట్లు చెప్పారు. మొత్తం 54 టైటిళ్లతో ఈ పుస్తకాలు మద్రించామన్నారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృత అకాడమీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు అకాడమీ పుస్తకాలతో ఎంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రూ.వందల కోట్లు, ఉద్యోగాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. నిధులు, ఉద్యోగాలపై సుప్రీంకోర్టు ఏపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.
* గులాబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. చాదర్‌ఘాట్, వద్ద వంతెనను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వంతెనతో పాటు చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు చిన్నారుల రావొద్దని హెచ్చరించారు. చాదర్‌ఘాట్, శంకర్‌నగర్ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షణలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కోఠి-చాదర్‌ఘాట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
* రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పంచాయితీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. నేతలిద్దరూ సీఎంను కలిసేందుకు తాడేపల్లికి వచ్చారు. వీరిద్దరూ ఇటీవల బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ పిలిచి వివరణ తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వై.వి.సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు. దీంతో ఆయన వారిని తాడేపల్లికి పిలిపించి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య వివాదానికి కారణాలు తెలుసుకుంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. అవసరమైతే ఇరువురు నేతలతో జగన్ కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
* హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు 19 మంది దరఖాస్తు చేసుకున్నారని పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదిక అందించినట్లు చెప్పారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లుతో కూడిన నివేదిక సమర్పించామన్నారు. ఈ నెల 30వ తేదీన భూపాలపల్లి సభ అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని రాజనర్సింహ స్పష్టం చేశారు.