* కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైకాపా గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు. ‘ఘోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే కుక్కలు. గ్రామ సింహాలు అంటే పళ్లు రాలగొట్టించుకునే కుక్కలు’ అని పవన్ వివరించారు. ‘‘భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా. వైకాపా అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైకాపా వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైకాపా నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.
* బిహార్‌లోని మధుబనీ జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్‌కు ‘డ్రీమ్-11’ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ.కోటి అతడి వశమైంది. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్‌కు ఓ సెలూన్ ఉంది. ఆ దుకాణమే అతడికి జీవనాధారం. క్రికెట్‌పై ఆసక్తితో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ‘డ్రీమ్-11’లో అశోక్ తరచూ బెట్టింగ్ పెట్టేవాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌పైనా బెట్టింగ్ పెట్టాడు. అనూహ్యంగా రూ.కోటి దక్కించుకున్నాడు. ఆ సంగతి తెలియగానే అశోక్ ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్ పెట్టానని, ఎప్పుడూ గెలవలేదని ఈ సందర్భంగా అతను చెప్పాడు. రూ.కోటి వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన రూ.కోటితో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు. రెండు, మూడు రోజుల్లో నగదు అశోక్ బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశముంది.
* ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) మసకబారింది అన్నప్పుడు నేను ఎన్నికల్లో నిలబడ్డా. జాయింట్ సెక్రటరీగా గెలిచా’ అని సీనియర్ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంచు విష్ణు, అతని ప్యానల్‌తో కలిసి నరేశ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. నరేశ్ మాట్లాడుతూ.. ‘‘మా’లో నేను 20 ఏళ్లు కేవలం సాధారణ సభ్యుడిగానే ఉన్నా. జయసుధ పోటీ చేస్తున్నప్పుడు నన్ను వైస్ ప్రెసిడెంట్‌గా చేయమని దివంగత దాసరి నారాయణరావు అడిగితే సరేనన్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ‘జాయింట్ సెక్రటరీగా చేస్తావా’ అన్నారు. ఇక్కడ ‘స్థాయి అంటూ ఏం ఉండదండి. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అయినా పోటీ చేసేందుకు సిద్ధం’ అని నేను అన్నాను. ‘మా’లో ప్రతి సభ్యుడూ సమానం అనే ఆలోచనతో వచ్చాం. మేం 22 మంది గెలిచాం. కానీ, జయసుధ ఓడిపోయింది. నేను జాయింట్ సెక్రటరీగా గెలిచాను. వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ అయ్యాను. నటులకు సినీ అవకాశాలు, కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేశాను. ఇవన్నీ చరిత్రలో ఓ భాగం. మసకబారుతున్న ‘మా’ను వెలుగులోకి తీసుకురావాలని చేసిన ప్రయత్నం అది’’ అని చెప్పారు.
* దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాతో సీఎం కేసీఆర్ పాలనలో ఆయా వర్గాలు ఎలా దగాకు గురయ్యాయో చెప్పామని.. తమ తదుపరి కార్యాచరణ నిరుద్యోగ సమస్యపై ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ‘విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో ఉద్యమం చేపడతామని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కలలు నెరవేరలేదని రేవంత్ ఆరోపించారు.
* అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వం భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు అఫ్గాన్ పౌరవిమానయాన శాఖ లేఖ రాసింది. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
* కొవిడ్ దెబ్బకు సింగపూర్ జనాభా తగ్గిపోయింది. 2020లో 56.90 లక్షలున్న జనాభా ఈ ఏడాది జూన్‌లో 54.50 లక్షలకు పడిపోయింది. 1970లో ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించడం మొదలుపెట్టిన తరవాత ఎన్నడూ ఇంతగా జనాభా క్షీణించలేదు. చాలామంది సింగపూర్ పౌరులు, శాశ్వత నివాస హోదా (పీఆర్) గల విదేశీయులు పనుల మీద ఇతర దేశాలకు వెళ్లి, కొవిడ్ ఆంక్షల వల్ల తిరిగి రాలేక ఏడాది కాలంగా బయటే ఉండిపోవడం దీనికి మూల కారణం. సింగపూర్‌లో ఉన్నవారు కూడా.. కొవిడ్ నిరోధానికి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయలేకపోతున్నారు. దీనివల్ల కొత్తగా పౌరసత్వం కానీ, పీఆర్ హోదా కానీ పొందడం ఆలస్యమవుతోంది. వివిధ పనులు పనిచేయడానికి ఇతర దేశాల వారు సకాలంలో పర్మిట్లు పొందలేకపోతున్నారు. సింగపూర్ జనాభాలో రానురానూ వృద్ధుల సంఖ్య పెరుగుతుంటే, జననాల రేటు తగ్గిపోతోంది.
* గన్నవరం విమానాశ్రయం వద్ద జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పవన్ గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. ఆయన ఎయిర్‌పోర్టు నుంచి మంగళగిరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు వద్ద పవన్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు తరలివచ్చారు. వారిని లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించి జాతీయ రహదారిపైనే అడ్డుకున్నారు. విమానాశ్రయం ఆవరణలో ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.2వేల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన రహదారుల నిర్మాణాలనూ చేపట్టలేని స్థితిలో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేల కోట్ల రూపాయల జాతీయ రహదారులు, సడక్ యోజన పథకం కింద గ్రామాల్లో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణాలపై బహిరంగ చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం ఎంత వేగవంతంగా జరుగుతోందో ప్రత్యక్షంగా మీడియాకు చూపిస్తామన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు.
* వైకాపాను, సీఎం జగన్‌ను విమర్శించే అర్హత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. వైకాపాలో చేరేందుకు పవన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా జగన్ దరి చేరనీయలేదని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నారాయణస్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈర్ష్యతోనే పవన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పైనే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని నారాయణస్వామి తెలిపారు.
* తండ్రిని విదేశానికి పంపించేందుకు వెళ్లి సోదరులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన శేరి సుదర్శన్(35) తండ్రి అనంతి దుబాయ్‌లో పనిచేసేవారు. తిరిగి వెళ్లేందుకు సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి కుమారుడితో పాటు అన్న కొడుకు శేరి రాజేందర్(35), బంధువు వంశీ(22)తో కలిసి నలుగురు కారులో బయలు దేరారు. మంగళవారం ఉదయం విమానాశ్రయానికి చేరుకున్నారు. కరోనా పరీక్ష చేయాల్సి ఉండడంతో ఆలస్యమవుతుందని.. తిరిగి వెళ్లాలని అనంతి కుమారులకు సూచించారు. వారు వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి-మజీద్‌పూర్ మధ్య (ట్రక్కు బే)లో కంటైనర్ నిలిపి ఉంది. కారు డ్రైవర్ రాజేందర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపుతప్పి కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వాహనం నుంచి అతికష్టం మీద మృతదేహాలను బయలకు తీశారు. సుదర్శన్ స్థంభంపల్లి విద్యుత్తు ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని గ్రామస్థులు చెప్పారు. ఎస్సై గణేశ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.