Politics

అతని మృతికి కేటీఆర్ బాధ్యత

అతని మృతికి కేటీఆర్ బాధ్యత

నగరంలోని మణికొండ నాలాలో ప్రమాదవశాత్తు పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్ చనిపోవడానికి గుత్తేదారు సహా పురపాలక శాఖ బాధ్యత ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ మంత్రిగా రజనీకాంత్ మృతికి బాధ్యత వహిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మండలి సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అకాల వర్షాలకు న్యూయార్క్ లాంటి నగరాలే ఇబ్బందులకు గురవుతున్నాయని కేటీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నాలాల విస్తరణకు ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్నామన్నారు. రోడ్ల విస్తరణలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించట్లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రజనీకాంత్‌ మృతికి బాధ్యతగా రూ.5 లక్షలు పరిహారాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. పరిహారం రూ.10 లక్షలకు పెంచాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు మరో రూ.5 లక్షలు తొందర్లోనే రజనీకాంత్‌ కుటుంబానికి అందిజేస్తామని కేటీఆర్‌ వివరించారు.