* ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను దక్కించుకునేందుకు చాలా సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. టాటా సన్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసినట్లు ప్రముఖ వాణిజ్య పత్రిక బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. కానీ, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఈ బిడ్డింగ్‌లో టాటా గ్రూపు విజయం సాధించినట్లు వచ్చిన కథనాలు సరికాదని పేర్కొంది. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో బిడ్లకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు వచ్చిన వార్తలు తప్పు అని పేర్కొంటూ కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఎం) కార్యదర్శి ట్విటర్‌లో స్పష్టంచేశారు. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఈ అంశంపై టాటా సన్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే ఎయిరిండియా సైతం స్పందించలేదు. అయితే, టాటా సన్స్ దాఖలు చేసిన బిడ్ ఆకర్షణీయంగా ఉందని గతకొన్ని రోజులుగా వివిధ వర్గాల ద్వారా వార్తలు బయటకు వచ్చాయి.
* జీఎస్‌టీ వసూళ్లు వరుసగా మూడోనెలా రూ.లక్ష కోట్లు అధిగమించాయి. సెప్టెంబరు నెలలో రూ.1.17 లక్షల కోట్లు వసూలయ్యాయి. గత ఐదు నెలల్లో ఇదే గరిష్ఠం. 2020 సెప్టెంబరుతో పోలిస్తే ఇవి 23 శాతం అధికం. వరుసగా ఎనిమిది నెలల పాటు రూ.లక్ష కోట్లకు పైగా నమోదైన జీఎస్టీ వసూళ్లు.. 2021 జూన్‌లో రూ.92,849 కోట్లకు తగ్గిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబరు జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టీ రూ.20,578 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.26,767 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.60,911 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.29,555 కోట్లతో కలిపి), సెస్సులు రూ.8,754 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.623 కోట్లతో కలిపి)గా ఉన్నాయి.
* పరాస్ డిఫెన్స్ సంస్థ భారీ ప్రీమియంతో మార్కెట్‌లో నేడు లిస్ట్ అయింది. ఒక దశలో ఇష్యూ ధర కంటే 171శాతం ప్రీమియం మదుపర్లకు లభించింది. ఈసంస్థ షేరు ఇష్యూ ధర రూ.175 కాగా.. బీఎస్‌ఈ రూ. 475 వద్ద లిస్టైంది. ఇప్పటి వరకు బీఎస్‌ఈలో 3.76లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1,945.13 కోట్లకు చేరింది. ఒక దశలో షేర్లు లిస్టింగ్ ధర నుంచి 5శాతానికి పైగా పెరగడంతో రూ.498.75 వద్దకు చేరగానే అప్పర్ సర్క్యూట్ పడింది.
* ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు టెలికాం శాఖ మరో షాకిచ్చింది. రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీ తిరస్కరించిందన్న ఆరోపణలపై ఈ కంపెనీలకు రూ.3,050కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా చెల్లించాలని తాజాగా ఆ కంపెనీలకు డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 2016లో రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ నెట్‌వర్క్‌తో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు ఇంటర్ కనెక్టివిటీను నిలిపివేశాయని ఆ మధ్య ఆరోపణలు వచ్చిన విషయం తెలసిందే. జియో వినియోగదారులు ఆ నెట్‌వర్క్‌లకు చేసిన 75శాతం కాల్స్ తిరస్కరణకు గురవుతున్నాయని అప్పట్లో జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో చర్యలు చేపట్టిన రెగ్యులేటరీ అథారిటీ.. తొలుత ఈ టెలికాం సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని భావించింది. అయితే కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని భావించి ఈ సంస్థలకు జరిమానా విధించాలని నిర్ణయించింది.