* తాను చెప్పని మాటలను చెప్పానని సినీ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని ప్రకాశ్‌రాజ్ ధ్వజమెత్తారు. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. ‘మీరు పవన్‌కల్యాణ్ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని, పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ‘‘నేను తెలుగువాడిని కాదు. కర్ణాటకలో పుట్టా. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నటుడిగా ఎదిగా. అంతమాత్రాన నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ‘మా’ నియమాల్లో ఉందా? రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నా. 9 నందులు తీసుకున్నా. అవతలి ప్యానెల్‌లో ఎవరైనా ఉన్నారా? దీనిపై చర్చ పెడితే జనం నవ్వుతారు. ప్రకాశ్‌రాజ్ మీద ఏదో ఒకటి చెప్పాలని విమర్శలు చేయడం తగదు. తెలుగు భాష గురించి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా నేను సిద్ధమే. తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన తెలుగువారు అయిపోరు. ఆత్రేయ, చలం, తిలక్ ఎవరి గురించైనా చర్చ పెడితే మాట్లాడతా.. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు దేని గురించైనా మాట్లాడే సత్తా నాలో ఉంది. అవతలి ప్యానెల్‌లో ఉన్న ఒక్క సభ్యుడిలోనైనా ఉందా? దమ్ముంటే ఎన్నికల్లో దిగాలి. కృష్ణుడినవుతా. రథం ఎక్కుతా. ఈ మాటలెందుకు? పవన్‌కల్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? ఆయన ప్రసంగాన్ని విశ్లేషించాలి. మొదట ఆయన సినీ నటుడు. ఆ తర్వాతే రాజకీయ నాయకుడు. విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్‌కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్ సినీ నటుడు. ఆయన రాజకీయ అజెండా మాకొద్దు. ఏపీ రాజకీయాలు నాకు తెలియవు. ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు, మూడు ప్రశ్నలు అడిగారు. అవి ఏ స్వరంతో అడిగారన్న దానిపై మనం చర్చించుకుందాం. ‘మీరు పవన్‌కల్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నరా’ అంటూ నన్నెందుకు లాగుతున్నారు. ఆయనకు నాకూ సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారు. అయితే, సినిమా విషయానికొస్తే నేను నంద.. ఆయన బద్రి.. అయిపోయిందంతే. ‘మా’ ఎన్నికల్లో జగన్‌ను లాగొద్దు. ఆయన పాదయాత్ర చేసి, ప్రజల మనసు గెలుచుకుని సీఎం అయ్యారు. ‘మా’ అసోసియేషన్ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదు. కేసీఆర్ ఉద్యమం చేసి, ఒక సీఎం అయ్యారు. ఆయనకు చాలా పనులున్నాయి. ఇందులోకి వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారు’’ అని ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు.
* జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటపై ఏపీ ప్రభుత్వ పెద్దలు విమర్శలు సంధించారు. సినిమాలు లేక ఖాళీగా ఉన్నప్పుడే పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర సమస్యలు గుర్తుకు వస్తాయని రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. రెండేళ్లలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు రహదారులపై అక్కడక్కడా పడిన గుంతలతో రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు పవన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ పర్యటనతో ప్రభుత్వం ఉలికిపాటుకు గురికావడంలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాలో ప్రచారం కోసమే పవన్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. వేరే రాష్ట్రంలో ఉంటూ 4 నెలలకో…3 నెలలకో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. జనంలో ఉండి ..జనం సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పవన్ వచ్చి ఏదో నాలుగు గుంతలు పూడ్చినంత మాత్రాన ఏదో అవుతుందని భ్రమ పడితే తామేమీ చేయలేమన్నారు. మీడియాలో పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నాలను తాము పట్టించుకోమని సజ్జల స్పష్టం చేశారు.
* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 46,193 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 220 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,66,183కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,919కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 244 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,57,665కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,599 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 56,463 మంది నమూనాలు పరీక్షించగా 809 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,160 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,142 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరు ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు.
* తెలంగాణ విద్యార్థులకు తీపి కబురు. నూతన ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007 చట్ట సవరణ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించింది. సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టగా… సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యాన భాండాగారంగా అవతరించిన నేపథ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలు, కీలక ఉద్యాన రంగంలో ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు అవకాశం కలిగింది. రాష్ట్రంలో ఏకైక అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీ రంగంలో బహుళ డిగ్రీ, డిప్లొమో కోర్సులు అందించడానికి ఈ విశ్వవిద్యాలయానికి వీలు కల్పించారు. ఫలితంగా ఇక్కడ చదివే విద్యార్థులకు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృతమైన అవకాశాలు, గుర్తింపు లభించనుంది. దేశంలో.. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యానరంగంలో ఉన్న డిమండ్, అవకాశాల దృష్ట్యా.. ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా వచ్చే ఈ వృత్తి విద్యా నిపుణులకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.
* ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్యని మొదటిసారి రాజమండ్రిలోనే కలిశానని గుర్తుచేసుకున్నారు. తమ మధ్య గురుశిష్యుల అనుబంధం ఉందని తెలిపారు.
* పవన్ కల్యాణ్ కేవలం సినీ పరిశ్రమకే కాకుండా ఈ రాష్ట్రానికే గుదిబండలా తయారయ్యారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్.. కులాల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. రాజకీయంగా ఎదగాలంటే ఇది పద్ధతి కాదనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్నికలు వస్తే ఏదో ఒక అలజడి సృస్టించాలనే ధోరణితో పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘పవన్ ఎవరి కోసం పోరాడుతున్నారు.. ఏ అజెండాతో ముందుకెళ్తున్నారు.. ఈ విషయాలపై ఆయనే క్లారిటీ తెచ్చుకోవాలి. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై ఆయన మాట్లాడిన తీరు సినీపరిశ్రమ వారికే నచ్చలేదు. సినీపరిశ్రమ బాగుపడుతుందనే కారణంగానే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని కోరుకున్నాం అని స్వయంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలే చెబుతున్నారు. వారంతా ఒక క్లారిటీతో ఉంటే.. పవన్ మధ్యలో వెళ్లి రాజకీయం జోడిండి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పవన్ మాట్లాడుతున్న భాష, ఆలోచనా విధానం చాలా ప్రమాదకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి సురేశ్ అన్నారు.
* సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా తాజాగా ట్విటర్ వేదికగా పంచుకున్న ఓ అల్పాహారానికి సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. అదే ‘పుల్ల ఇడ్లీ’. సాధారణంగా పుల్ల ఐస్‌క్రీం గురించి అందరికీ తెలుసు! కానీ.. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మాత్రం పుల్ల ఇడ్లీ చేస్తున్నారు. పుల్ల సాయంతో ఇడ్లీని చట్నీ, సాంబార్‌లో ముంచుకుని తినేలా తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేస్తూ.. ‘బెంగళూరు.. దేశ వినూత్న ఆవిష్కరణలకూ రాజధాని అయిన ఈ నగరం, తన సృజనాత్మకతను ప్రదర్శించకుండా ఉండలేకపోతోంది’ అనే వ్యాఖ్యను జతచేశారు.
* ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఇందులో మోహన్‌బాబు.. తన వ్యక్తిగత జీవితాన్ని కొంతమేర తెలియజేశారు. పరిటాల రవితో ఉన్న అనుబంధం గురించి చెప్పాలని ఆలీ కోరగా.. ‘ఆలీ నేను నా జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాను. కానీ, ఇప్పుడు నువ్వు నా జీవితం మొత్తాన్ని ఇక్కడే అడిగేస్తున్నావు. పరిటాల రవి గొప్ప వ్యక్తి. నాకో మంచి సోదరుడు. అతని అకాల మరణం వల్ల నేనొక మంచి సోదరుడిని కోల్పోయాను’ అంటూ మోహన్‌బాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన ‘పెదరాయుడు’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా తండ్రి పాత్ర (పాపారాయుడు) చేయడానికి రజనీకాంతే ఆసక్తి కనబరిచారు. అతడో గొప్ప స్నేహితుడు’ అని మోహన్‌బాబు అన్నారు. ‘మేజర్ చంద్రకాంత్’తోపాటు ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం గురించి మోహన్‌బాబు ఏం చెప్పారో తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి చూడాల్సిందే.
* రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే గ్రామ స్వరాజ్యం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా ఎంతని ప్రశ్నిస్తే మైక్ కట్ చేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం వల్ల అధికార పార్టీ సభ్యులకు ఏం ఆనందం కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ‘‘గ్రామ పంచాయతీలకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెబుతోంది. మరో వైపు మేమే ఇస్తున్నామని కేంద్రం అంటోంది. రాష్ట్రం, కేంద్రం నిధులు ఎంతో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ఎంత? కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ప్రశ్నిస్తే సబ్జెక్ట్ కాదంటున్నారు. మంత్రులను కాదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. డబ్బా కొడుతుంటే మాత్రం స్పీకర్ గంటల కొద్దీ సమయం ఇస్తున్నారు. సభ్యుల హక్కులు, సభా సంప్రదాయాలను సీఎం గౌరవించాలి. ప్రతిపక్షాల ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలను సర్పంచ్‌లు విశ్లేషించుకోవాలి’’ అని సీతక్క అన్నారు.
* జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌తో ప్రముఖ సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆయన నివాసంలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, నవీన్ ఎర్నేని, సునీల్ నారంగ్, బన్నీ వాసు, వంశీరెడ్డి తదితరులు పవన్‌ను కలిశారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
* దేశంలో అధికారులు, పోలీస్ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోయే పోలీసులను న్యాయవ్యవస్థ రక్షించలేదని స్పష్టంచేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. కోర్టులను ఆశ్రయించడం కొందరు అధికారులకు అలవాటుగా మారిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అదనపు డీజీపీ గుర్జిందర్ పాల్ సింగ్ తనపై నమోదైన క్రిమినల్ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అయితే, ప్రస్తుతానికి స్థాయీ సంఘం ఏర్పాటుపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.