Food

బెజవాడలో మటన్ అంటే బీఫ్. కుళ్లిన మాంసంతో బిర్యానీలు.

బెజవాడలో మటన్ అంటే బీఫ్. కుళ్లిన మాంసంతో బిర్యానీలు.

బెజవాడలోని పలు రెస్టారెంట్లు, హోటల్స్.

ఎన్ని దాడులు చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నా హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహాకుల్లో మార్పు రావడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. తప్పు అని తెలిసినా తీరు మాత్రం మార్చుకోవడం లేదు. తమ లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. తినే తిండిని సైతం కల్తీ చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యం అంటే లెక్క లేదు. అధికారులంటే భయం లేదు. కాసుల కక్కుర్తితో నిల్వ ఉంచిన, కుళ్లిన పదార్ధాలతో ఆహారాన్ని తయారు చేసి కస్టమర్లకు అంటగడుతున్నారు. మటన్ బిర్యానీలో బీఫ్ మిక్స్ చేసి మరీ వడ్డిస్తున్నారు. విజయవాడలో ఇదంతా కామన్ గా మారింది. ఇలాంటి ఘటనలు ఇంతకముందూ ఉన్నాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించటం వ్యాపారులకు, తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం అధికారులకు కామన్ గా మారింది. తాజాగా కుళ్లిన మాంసాన్ని వినియోగదారులకు అంటగడుతున్న కొన్ని రెస్టారెంట్లపై దాడులు చేశారు అధికారులు.

విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలతో హోటల్స్, రెస్టారెంట్లలో దాడులు చేశారు. సింగ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురంలో పలు రెస్టారెంట్లు, హోటల్స్ లో తనిఖీలు చేశారు. నిల్వ ఉంచిన, కల్తీ మాంసాన్ని గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసంలో రంగులు కలిపి కస్టమర్లకు అంటగడుతున్నారని తేల్చారు. మటన్ బిర్యానీలో బీఫ్ కలిపి సర్వ్ చేస్తున్న తీరు బయటపడింది. దీంతో మూడు రెస్టారెంట్లకు(లక్ష్మీ, మానస, శ్రీ ఆంజనేయ) నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంతేకాదు జరిమానా కూడా విధించారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

”సింగ్ నగర్, ప్రకాశ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలుపుతారని మాకు ఫిర్యాదులు అందాయి. దీంతో మేము సోదాలు నిర్వహించాము. చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసంతో వంటకాలు చేస్తున్నారు. అంతేకాదు హానికరమైన కెమికల్స్ వాడుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి వారికి ఫైన్ వేశాము” అని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి రావడంతో జనాలు భయపడుతున్నారు. బయటికెళ్లి మటన్ బిర్యానీ తినాలంటే ఆలోచిస్తున్నారు. తమ ఆరోగ్యంతో చెలగాటం ఆడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.