Movies

“మా” ఎన్నికల ముచ్చట్లు-TNI ప్రత్యేకం

“మా” ఎన్నికల ముచ్చట్లు-TNI ప్రత్యేకం

* ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా. రెండు ప్యానెల్స్‌ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు, చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం’’ అని బాలకృష్ణ అన్నారు.

* ‘మా’ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు అవకాశమే లేదని సినీ నటి కరాటే కళ్యాణి అన్నారు. సాధారణ ఎన్నికల్లోనే రిగ్గింగ్‌ జరగడం లేదని, అలాంటిది ‘మా’ ఎన్నికల్లో ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ‘మా’ ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

* ప్రస్తుతం మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎవరూ ఎవరికీ శత్రువులు కాదని, సినీనటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఎవరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది 900మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబం. కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉదయం అందరూ కలిసికట్టుగా కనిపించడం సంతోషంగా ఉంది. కనీసం ఇప్పటికైనా మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. ఇరు ప్యానెల్స్‌లోనూ నాతో పనిచేసిన నటులు ఉన్నారు. ఎవరు ఎక్కువ సమయం కేటాయించి కళాకారుల సమస్యలు తీరుస్తారో, దాన్ని బట్టే అందరూ ఓటు వేస్తారు. కరోనా కారణంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. విద్వేష రాజకీయాలు ఇక్కడితో ఆపండి. పక్క నుంచి మాట్లాడేవాళ్ల వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు ఎవరికీ శత్రువులు కాదు’’అని అన్నారు.

* మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు 30శాతం మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, మనోజ్‌, మోహన్‌బాబు, మంచు లక్ష్మి, సుమ, శ్రీకాంత్‌, నరేశ్‌, శివాజీరాజా, ఉత్తేజ్‌, శివబాలాజీ, సుడిగాలి సుధీర్‌, రాఘవతోపాటు పలువురు సీనియర్‌ నటీనటులు ఓటు వేశారు.

* ‘మా’ ఎన్నికల అధ్యక్ష బరిలో మహిళలకు కూడా అవకాశం ఇస్తే బాగుండేదని సినీ నటుడు సుమన్‌ అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన నిబంధనలు రావాలంటే కష్టం. ఏపీలో షూటింగ్స్‌ చేసుకునేందుకు ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో చిన్న నిర్మాతల కోసం సీఎం కేసీఆర్‌ కూడా ఫిల్మ్‌సిటీ నిర్మించాలి. లోకల్‌, నాన్‌-లోకల్‌ అనే అంశం రాకూడదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి షూటింగ్స్‌లో పాల్గొంటాం’ అని సుమన్‌ అన్నారు.

* ‘మా’ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు. ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్న చిరు, భవిష్యత్‌ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని, అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు. కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని, దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.

* ‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ నటులు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటున్నారు. తాజాగా అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ ‘మా’ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.