* రెండో పెళ్లికి అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను పాముకాటుతో చంపించిన భర్తకు కేరళలోని ఓ సెషన్స్ కోర్టు రెండు జీవితఖైదుల శిక్ష విధించింది. ఈ కేసులో భర్త సూరజ్‌ను దోషి అని గత సోమవారం తేల్చిన న్యాయస్థానం.. నేడు శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది అత్యంత అరుదైన కేసు. ఈ నేరానికి గానూ దోషికి మరణశిక్ష విధించాలి. కానీ, అతడి వయసు(28ఏళ్లు)ను దృష్టిలో పెట్టుకుని జీవితఖైదు విధిస్తున్నాం’’ అని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో పాటు సాక్ష్యాలను నాశనం చేసినందుకు మరో 5ఏళ్లు, గతంలో ఒకసారి హత్యాయత్నం చేసినందుకు 10ఏళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ 17ఏళ్ల జైలుశిక్ష పూర్తయిన తర్వాతే రెండు జీవిత ఖైదుల శిక్ష మొదలవుతుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ శిక్షలతో పాటు రూ.5.85లక్షల జరిమానా కూడా విధించింది. కేరళలోని కొల్లం జిల్లా అంచల్ ప్రాంతానికి చెందిన ఉత్రాకు అదే ప్రాంతానికి చెందిన సూరజ్ కుమార్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న సూరజ్.. తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు ఉత్రా అడ్డుగా ఉండటంతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. ఇందుకోసం గతేడాది మే నెలలో స్థానికంగా పాములు పట్టే వ్యక్తికి డబ్బులు ఇచ్చి నాగుపామును తీసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని నిద్రిస్తున్న ఉత్రాపైకి వదిలాడు. పాము రెండుసార్లు కాటు వేయడంతో ఆమె నిద్రలోనే మరణించింది. అయితే గతంలో కూడా ఉత్రా ఓసారి పాము కాటుకు గురికావడంతో ఆమె మృతిపై అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
* కొన్ని సంవత్సరాల పాటు దాదాపు 28 మంది వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ ఓ 17 ఏళ్ల బాలిక కన్నీటి పర్యంతమైంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ దారుణాలకు మూలకారకుడు కావడం ప్రతిఒక్కరినీ నివ్వెరపరుస్తోంది. తన తండ్రి, బీఎస్పీ, ఎస్పీ పార్టీలకు చెందిన నేతలు, సమీప బంధువులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో ఈ కేసు నమోదైందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఆ బాలిక వెల్లడించిన వివరాల ప్రకారం…‘మా నాన్న ట్రక్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే.. నాకు అసభ్యకరమైన చిత్రాలు చూపించి, లైంగికంగా లొంగదీసుకొనేందుకు ప్రయత్నించాడు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ తర్వాత నమ్మించి ఒకరోజు నాకు కొత్త బట్టలు కొనిచ్చి, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. మా అమ్మను చంపేస్తానని బెదిరించాడు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ ఘటన తర్వాత మా నాన్న ఒకరోజు మత్తుమందు కలిపిన అన్నం తినిపించాడు. తర్వాత నన్ను ఒక హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నాపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాకు స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై దుస్తులు లేవు. తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ప్రతిసారి నాకు ఇదే పరిస్థితి ఎదురయ్యేది. ఎవరో కొత్త వ్యక్తి వచ్చేవాడు. ఏ మాత్రం జాలి లేకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఒకసారి తిలక్ యాదవ్ వచ్చాడు. నేను వ్యతిరేకించడంతో నీ తండ్రే పంపాడంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు. తిలక్‌తోపాటు ఆయన స్నేహితులు, బంధువులు, మా బంధువులు నన్ను ఇలాగే తీవ్రంగా హింసించారు’ అంటూ తన దయనీయ పరిస్థితిని పోలీసులకు వెల్లడించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను ఈ కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. అత్యాచార ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఏది ఏమైనప్పటికీ.. ఆ బాధితురాలు ఎదుర్కొన్న దారుణ పరిస్థితి ప్రతిఒక్కరి హృదయాలను మెలిపెడుతోంది.
* సరకుల మాటున భారీ మొత్తంలో హెరాయిన్‌ను భారత్‌లోకి అక్రమంగా పంపించేది అఫ్గానిస్థాన్ వాసి హసన్ హుస్సేన్.. అవి మన దేశంలో ఎవరికి చేర్చాలో నిర్దేశించేది ఇక్కడ ఆయన ప్రతినిధి అమిత్. అతని ఆదేశాలకు అనుగుణంగా తన కంపెనీ పేరుతో ఇన్‌వాయిస్‌లు రూపొందించి ఆచరణలో పెట్టేది మాచవరం సుధాకర్. ముంద్రా పోర్టులో గత నెల భారీగా హెరాయిన్ పట్టుబడ్డ కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నాయి. ‘‘మాచవరం సుధాకర్‌కు తొలుత అఫ్గానిస్థాన్‌కు చెందిన హసన్ హుస్సేన్‌తో పరిచయమైంది. తద్వారా భారత్‌లో ఆయన ప్రతినిధిగా వ్యవహరించే అమిత్‌తో చేతులు కలిపారు. వీరిరువురితో పాటు మరికొందరు అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాల సభ్యులతో కలిసి రూపొందించిన కుట్రలో భాగంగానే సుధాకర్.. ఆయన భార్య వైశాలి పేరిట విజయవాడ చిరునామాతో ఆషీ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. ఆ చిరునామాతోనే ఎగుమతులు, దిగుమతుల కోడ్ లైసెన్సు(ఐఈసీ) తీసుకున్నారు. దాన్ని ఉపయోగించే సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ స్టోన్స్ ముసుగులో హెరాయిన్‌ను భారత్‌లోకి దిగుమతి చేసేవారు. ఇది పోర్టుకు చేరిన తర్వాత దాన్ని అక్కడి నుంచి ఎవరికి చేరవేయాలో అమిత్ ఆదేశించేవారు. ఆ మేరకు వారికి సరకు విక్రయిస్తున్నట్లు సుధాకర్ ఇన్‌వాయిస్‌లు రూపొందించేవారు. వాటి సాయంతో పోర్టు నుంచే ఆ సరకు సంబంధిత చిరునామాకు వెళ్లిపోయేది’’ అని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇలా హసన్ నుంచి గత జూన్‌లో ఒక కన్‌సైన్‌మెంట్ ఆషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో దిగుమతై.. దిల్లీలోని కుల్‌దీప్‌సింగ్‌కు చేరినట్లు తేల్చాయి. ఇదే తరహాలో మరోమారు తరలించేందుకు జరిగిన ప్రయత్నంలోనే గత నెలలో డీఆర్‌ఐ అధికారులకు భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ఈ లావాదేవీలకు సంబంధించిన డబ్బులు హవాలా రూపంలో సుధాకర్ భార్య వైశాలి బ్యాంకు ఖాతాలో జమయ్యాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
* ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోపి పెడుతున్న హెడ్ కానిస్టేబుల్‌ను సైబరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. బాధితుల నుంచి రూ.1.68 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఏపీ జెన్‌కోలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగమిప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేసి మోసం చేశాడంటూ వ్యాస్‌నగర్‌కు చెందిన బాధితుడు ఈ నెల 7న నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి కర్నూలు జిల్లా ఓక్ మండలం ఉప్పలపాడుకు చెందిన బోయా షేక్ షావలీ(42)ని అరెస్టు చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం హైదర్షాకోటలో నివాసముంటూ.. టీఎస్‌ఎస్‌పీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2019లో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అప్పటి నుంచి ‘సిక్’ లీవ్‌లో ఉన్నాడు. గతంలో ప్రముఖుల వద్ద వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్‌వో)గా విధులు నిర్వహించాడు. అప్పుడు దిగిన ఫొటోలను ఇప్పుడు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసగించి రూ.1.68 కోట్లు వసూలు చేసినట్లు లెక్క తేల్చారు.