Business

జీవితకాల గరిష్ఠానికి టాటా మోటర్స్ షేరు ధర-వాణిజ్యం

జీవితకాల గరిష్ఠానికి టాటా మోటర్స్ షేరు ధర-వాణిజ్యం

* రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త‌న తాజా ద్ర‌వ్య విధాన స‌మీక్ష‌లో ప్ర‌స్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5.3 శాతంగా అంచ‌నా వేసింది. ఇప్పుడు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేస్తే వ‌చ్చే వ‌డ్డీ రాబ‌డి క‌న్నా ద్ర‌వ్యోల్బ‌ణం ఎక్కువ అవుతుంది. దీంతో డిపాజిట‌ర్ల‌కు వ‌డ్డీ గిట్టుబాటు అవ్వ‌క‌పోగా అస‌లు డిపాజిట్‌తో వ‌డ్డీ క‌లిపి అందుకున్నా దాని విలువ త‌క్కువే. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో 1 సంవ‌త్స‌రం నుంచి 2 సంవ‌త్స‌రాల సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు వ‌డ్డీ 5% శాతంగా ఉంది. రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 5.3 శాతంగా అంచ‌నా. దీంతో పొదుపుదారుడికి వాస్త‌వ వ‌డ్డీ రేటు -0.3 శాతంగా అవుతుంది. దీంతో బ్యాంక్ వినియోగ‌దారుల‌కు బ్యాంకు వ‌డ్డీ గిట్టుబాటు అవ్వ‌క‌పోగా వారికి వ‌చ్చే రాబ‌డి తగ్గుతుంది. అయితే బ్యాంక్ ఎఫ్‌డీల‌ నుంచి పోస్టాఫీస్ పొదుపు ప‌థ‌కాల‌కు డ‌బ్బును త‌ర‌లించ‌డం వ‌ల్ల మామూలుగానే కాస్తా ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. ప్ర‌స్తుతం పోస్టాఫీసుల్లో వ‌డ్డీ రేట్లు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి కొద్దిగా ఎక్కువ‌గా 5.5%, కొన్ని ప‌థ‌కాల్లో దీనికి మించి వ‌డ్డీ రేట్లు ఉన్నాయి.

* ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి రిటైరైన త‌ర్వాత పెన్ష‌న్ పొందేందుకుగానూ ఫించ‌నుదారులు ఏటా జీవ‌న ప్ర‌మాణ ప‌త్రం (లైఫ్ స‌ర్టిఫికెట్‌) స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప్ర‌తి ఏడాది న‌వంబ‌రు 1 నుంచి 30 తేదీలోపు ఈ ప‌ని పూర్తి చేయాలి. 80 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న వారు అక్టోబ‌రు 1 నుంచే పెన్ష‌న్ స‌ర్టిఫికెట్లు సబ్మిట్‌ చేసే వెసులుబాటును ప్ర‌భుత్వం క‌ల్పించింది. అంటే 80 ఏళ్ల కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న వృద్ధులు ఇప్పుడు అక్టోబ‌రు 1 నుంచి – న‌వంబ‌రు 30 మ‌ధ్య ఈ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించొచ్చు. అయితే వీటిని స‌మ‌ర్పించేందుకు మున‌ప‌టి రోజుల్లో ఫించనుదారులు స్వ‌యంగా బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఈ జీవ‌న ప్ర‌మాణ ప‌త్రాల‌ను ఇంటి నుంచే ఇవ్వొచ్చు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా ఉన్న సానుకూలతలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. పారిశ్రామికోత్పత్తి ఆశాజనకంగా నమోదుకావడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠానికి చేరడం మార్కెట్లలో విశ్వాసాన్ని నింపింది. మరోవైపు కరెంటు సంక్షోభాన్ని చల్లార్చడానికి నేరుగా పీఎంఓ రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం సూచీల్లో సెంటిమెంటును నింపింది. దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తి స్థాయి సీటింగ్‌కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఇది కూడా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు టాటా మోటార్స్‌ ఈవీ వ్యాపారంలోకి టీపీజీ రైజ్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండడం సైతం ఆ రంగ షేర్లపై సానుకూల ప్రభావం చూపనుంది. వీటికి తోడు ఐఎంఎఫ్‌ ఈ ఏడాది వృద్ధి రేటును 9.5 శాతంగా అంచనా వేయడం, వచ్చే నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందన్న అంచనాలు సైతం మార్కెట్ల లాభాలకు దోహదం చేస్తున్నాయి. ఈరోజు ఇన్ఫోసిస్‌, విప్రో, మైండ్‌ట్రీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. టీసీఎస్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో మదుపర్లు ఈ కంపెనీల ఫలితాలపై దృష్టి సారించారు.

* స్టాక్‌ మార్కెట్లలో ఇటీవల రిటైల్‌ మదుపర్ల సంఖ్య పెరిగింది. యువతరం రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడడం లేదు. పైగా దీర్ఘకాల వ్యూహాలతో మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నారు. అయితే, ప్రొఫెషనల్‌ మదుపర్లు మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తూ లాభాల్ని గడిస్తున్నారు. కానీ, రిటైల్ మదుపర్లకు ఆ అవకాశం ఉండదు. వీరు మార్కెట్‌ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. పైగా అధిక లాభాల్ని ఆర్జించేందుకు సరిపడా డబ్బు ఉండదు. ఇలాంటి వారి కోసమే ‘సిప్‌ ఆన్‌ స్టాక్స్‌’ పద్ధతి అందుబాటులో ఉంది.

* టాటా మోటార్స్ షేర్‌ హోల్డర్లకు ఈరోజు కనక వర్షం కురిసింది. ఈ స్టాక్‌ ధర ఈరోజు ఓ దశలో ఏకంగా 22 శాతానికి పైగా పెరిగి రూ.523 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. దీంతో మదుపర్లకు లాభాల పంట పండింది. టాటా మోటార్స్‌ విద్యుత్తు వాహన విభాగంలోకి టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7500 కోట్లు) సమీకరించడమే ఇందుకు కారణం. ఉదయం ఈ స్టాక్ రూ.462 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. చివరకు 21.11 శాతం లాభంతో రూ.509.70 వద్ద ముగిసింది. ఏడాది క్రితం రూ.126 వద్ద ట్రేడైన ఈ షేరు.. ఏకంగా 415 శాతం ఎగబాకడం విశేషం. గత మూడు రోజుల్లోనే ఈ స్టాక్‌ విలువ 46 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.81 లక్షల కోట్లకు చేరింది.