స్కూలు తెరుస్తున్నారనగానే కొందరు చిన్నారుల్లో ఆందోళన మొదలవుతుంది. తల్లిదండ్రులేమో అది తెలుసుకునే ప్రయత్నం చేయరు సరికదా బలవంతంగా పంపించేలా చూస్తారు. దానికి కారణం బడి అంటే భయమే. దాన్ని ఇప్పుడే గుర్తించడం అవసరం. ఒకవేళ బళ్లో ఏదయినా సమస్య ఉంటే… మీరు అండగా ఉంటారనే భరోసా వారికి కల్పించాలి. అలాగే స్కూలుకి వెళ్లే ముందు వారిలో ఉన్న భయాలు మీతో పంచుకునే అవకాశం ఇవ్వండి. తోటి పిల్లలతో ఏవయినా సమస్యలు ఉన్నా, టీచర్లతో ఇబ్బంది ఉన్నా మీరు మాట్లాడి పరిష్కరిస్తానని హామి ఇవ్వండి. కొందరు చిన్నారుల్లో పరీక్షలు, గ్రేడ్‌లకు సంబంధించి కూడా ఆందోళన మొదలవుతుంది. అలాంటి సమస్య ఏదయినా ఉంటే… అర్థంకాని సబ్జెక్టుల విషయంలో సాయం చేస్తాననే భరోసా కలిగించండి. పిల్లల చదువు విషయంలో మీరు, వాళ్లు కిందటేడాది చేసిన పొరబాట్లు ఏంటో ఒకసారి సమీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం. వారి ఇష్టాలు ఎంతవరకూ నెరవేరాయి… రాబోయే సవాళ్లు… వంటివన్నీ పరిగణించండి. వీటన్నింటి ఆధారంగా ఓ ప్రణాళిక ఇప్పుడే సిద్ధం చేయండి. వాళ్లు రోజూ చదువుకు కేటాయించే సమయం మొదలు… నిద్రాహార వేళలు, మిగిలిన అంశాలు, ఆసక్తులు వంటివి గమనించి దినచర్యను తయారుచేయాలి. అందులో ఆటలకు సమయం తప్పకుండా ఉండాలి. పిల్లలు దానికి అనుగుణంగా మానసికంగా సిద్ధమవుతారు. ఆ ప్రకారం నడుచుకుంటారు. ఒత్తిడి సమస్య కూడా అదుపులో ఉంటుంది. అన్నింటినీ సమన్వయం చేసుకోగలుగుతారు. చదువులో రాణిస్తారు.
బడి తెరుస్తున్నారు…
Related tags :