* దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కార్పొరేట్ సంస్థల ఆశాజనక ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజూ సూచీలు లాభపడ్డాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు సైతం సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 383 పాయింట్లు లాభపడి, 61,350 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సైతం 143 పాయింట్ల లాభంతో 18,268 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర షేర్లు లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
* ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్.. తాను స్థాపించిన టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీలతో ఆయా రంగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. సోమవారం ఒక్కరోజే ఆయన సంపద ఏకంగా 36.2 బిలియన్ డాలర్లు ఎగబాకింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.2.71 లక్షల కోట్లు. అంటే గంటకు సుమారు రూ.11.31 వేల కోట్లన్నమాట! నిన్న హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో సంస్థ షేరు విలువ అమాంతం పెరిగింది. సోమవారం ఒక్కరోజే టెస్లా షేరు విలువ 14.9 శాతం పెరిగి 1,045.02 డాలర్లకు చేరింది.
* ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ ఎప్పటికప్పుడు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలతో ధీమా కల్పిస్తోంది. అందులో భాగంగా తీసుకొచ్చిన జీవన్ ఉమంగ్ అనే పథకానికి భారీ ఆదరణ లభిస్తోంది. దీంట్లో పాలసీదారుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాతో ఉంటుంది. అలాగే పాలసీ మొత్తం ప్రీమియంలు పూర్తిగా చెల్లిస్తే ఫించను తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి.
*** పాలసీ వివరాలు..
క్లెయిమ్ కనీస హామీ మొత్తం : రూ.2 లక్షలు
గరిష్ఠ హామీ మొత్తం : పరిమితి లేదు
ప్రీమియం చెల్లిండానికి కాల పరిధి(ఏళ్లలో) : 15, 20, 25, 30
పాలసీ పరిధి : (100 – పాలసీలోకి ప్రవేశించిన నాటికి వయస్సు) ఏళ్లు
కనీస వయస్సు : 90 రోజులు
గరిష్ఠ వయస్సు : 55 ఏళ్లు
ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన కనీస వయస్సు : 30 ఏళ్లు
ప్రీమియం చెల్లించడం పూర్తయ్యే నాటికి ఉండాల్సిన గరిష్ఠ వయస్సు : 70 ఏళ్లు
పాలసీ మెచ్యూరిటీకి గరిష్ఠ వయస్సు : 100 ఏళ్లు
కాలపరిమితి విషయానికి వస్తే ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రీమియంలు చెల్లించడానికి 30 ఏళ్ల పరిధితో పాలసీ తీసుకుంటే వారికి ఉండాల్సిన వయస్సు 40. అంటే.. ప్రీమియం చెల్లింపులు పూర్తయ్యే నాటికి 70 ఏళ్ల వయస్సు వస్తుంది. 70 ఏళ్ల తర్వాత ప్రీమియం చెల్లించే అవకాశం లేదు కాబట్టి అక్కడితో పాలసీ పరిధి పూర్తయి ప్రయోజనాలు అందడం ప్రారంభమవుతుంది. ఒకవేళ 15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకోవాలంటే వయస్సు 55 ఏళ్ల లోపు ఉండాలి. ఇక పుట్టిన మూడు నెలల తర్వాత పిల్లలకు ఈ పాలసీ తీసుకుంటే తప్పనిసరిగా 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. అంటే వారి వయస్సు 30 ఏళ్లు పూర్తి కాగానే వారికి ఏటా ప్రయోజనాలు అందటం మొదలవుతాయి.
* జాగ్వర్ ల్యాండ్‌రోవర్ ఇండియా భారత్‌లో 2021 జాగ్వర్ ఎక్స్ఎఫ్ను లాంఛ్ చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ లగ్జరీ కారు ధర రూ 71.60 లక్షల నుంచి రూ 76 లక్షలకు (ఎక్స్‌షోరూం, ఇండియా)అందుబాటులో ఉంటుంది.
* వచ్చే ఏడాది జనవరిలో కొమకి ఎలక్ట్రిక్ వెహికల్స్ తమ తొలి ఎలక్ట్రిక్ క్రూజర్ బైక్‌ను లాంఛ్ చేయనుంది. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధ కొమకి భారత్‌లో ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయిస్తోంది. న్యూ ఎలక్ట్రిక్ క్రూజర్ కస్టమర్లకు మెరుగైన శక్తివంతమైన డ్రైవింగ్ అనుభూతిని ఇవ్వడంతో పాటు అధిక మైలేజ్‌ను ఇస్తుందని స్టైలిష్ లుక్‌తో అందుబాటు ధరలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
* తెలంగాణ ఆర్టీసీ డిజిటల్ చెల్లింపుల విధానంలో మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. ఎంజీ బస్ స్టేషన్‌లోని టికెట్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. టికెట్ రిజర్వేషన్, పార్సిల్, కార్గో సర్వీసులకు ఈ డిజిటల్ పేమెంట్స్ సేవలు వర్తించనున్నాయి. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)లో ఈ తరహా చెల్లింపు సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.