Health

వీగోవీ బిళ్ల వేసుకుంటే కొవ్వు మాయం

వీగోవీ బిళ్ల వేసుకుంటే కొవ్వు మాయం

అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్‌ షాపులకు పోటెత్తుతున్నారు. నోవో నోర్డిస్క్‌ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు అక్కడ భారీ ఆదరణ లభిస్తోంది. అయితే, గిరాకీకి తగ్గట్లుగా సరఫరా చేయలేకపోతున్నారు. దీని వినియోగానికి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి. గతంలో అనేకం వచ్చినప్పటికీ.. వాటికి నియంత్రణ సంస్థల క్లియరెన్స్‌ లభించలేదు. పైగా తీవ్ర దుష్ప్రభావాలు ఉండేవి. ఆపై అవి పెద్దగా ఫలితాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే వీగోవీకి డిమాండ్ పెరిగింది.

వీగోవీ అనేది ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాల్సిన ఓ ఔషధం. వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవాలి. ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. దాదాపు 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని సమాచారం. ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్‌ కంపెనీకి ఆదాయం సైతం భారీగా పెరిగింది. గత త్రైమాసికంలో సంస్థ ఆదాయం 41 శాతం ఎగబాకింది.

ఈ ఔషధానికి గిరాకీ పెరగడానికి కొవిడ్‌ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారికి కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చడంతో అందరికీ బరువు తగ్గడంపై ధ్యాస పెరిగిందని సంస్థ సీఈఓ లార్స్‌ జోర్గెన్సన్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి డిమాండ్‌కు సరిపడా స్థాయిలో ఔషధాన్ని ఉత్పత్తి చేస్తామన్నారు.

డయాబెటిస్‌ చికిత్సలకు సంబంధించిన ఔషధాలను తయారు చేయడంలో నోవో నోర్డిస్క్‌కు మంచి పేరుంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ఈ రంగంపై నోవో దృష్టి సారించింది. అమెరికాలో మూడోవంతు యువకులు స్థూలకాయంతో బాధపడుతున్న రాష్ట్రాల సంఖ్య 2018 తర్వాత రెండింతలైంది. పైగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు హృద్రోగ, క్యాన్సర్‌, డయాబెటిస్‌ వంటి సమస్యల్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోవో ఈ జీవనశైలి సమస్యపై దృష్టి సారించింది.

వచ్చే ఏడాది నాటికి అమెరికాలో వీగోవీకి భారీ ఆదరణ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో సంస్థ వార్షికాదాయం 2024 నాటికి 3.2 బిలియన్ డాలర్లకు ఎగబాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఔషధం వినియోగం వల్ల వాంతులు, యాసిడ్‌ రీఫ్లక్స్ వంటి దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు సమాచారం.