Politics

భాజాపానే గెలుస్తుందంటున్న మోడీ. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ముందా?-తాజావార్తలు

భాజాపానే గెలుస్తుందంటున్న మోడీ. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ముందా?-తాజావార్తలు

* మరికొన్ని నెలల్లో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సామాన్యులకు పార్టీకి మధ్య విశ్వాస వారధిగా నిలవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దేశంలో కొవిడ్‌ తీవ్రతే ప్రధాన అజెండాగా జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ముఖ్య నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

* దీపావళి పర్వదినాన్ని సాధారణంగా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించి టపాసులు కాల్చుతూ.. ఆనందంగా జరుపుకొంటారు. కానీ, తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని వినూత్నంగా చేసుకున్నారు. ఆవు పేడతో కొట్టుకుంటూ పండగ జరుపుకొన్నారు. తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్‌ హబ్బా అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆవుపేడను ఒకరిపై ఒకరు విసురుకుంటూ సందడిగా గడిపారు. ఈ పండుగలో గ్రామస్థులు శరీరభాగాలకు పేడను పూసుకుంటూ వేడుక చేసుకుంటారు. పేడను విసురుకునేటప్పుడు కోపాన్ని దరి చేరనీయకుండా ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని గుమటపురం గ్రామప్రజలు కొనసాగిస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

* మాట తప్పను.. మడమ తిప్పనని చెప్పిన జగన్‌ మోహన్‌రెడ్డి ఎన్నో వాగ్దానాలు చేసి రాజధానిని ఎక్కడికి పట్టుకెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టకుండా ఇవాళ్టికి కూడా రూ.4 సెస్‌ ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. రోడ్ల కోసమని రెండు రూపాయలు చొప్పున సెస్‌ వసూలు చేస్తున్నారు. కానీ, రోడ్ల మరమ్మతులు ఎక్కడ చేస్తున్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్‌ను అదోగతిపాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి దానికి జీఎస్టీ ఉన్నప్పుడు.. మద్యం అమ్మకాలకు బిల్లులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి కేంద్రం 25లక్షల ఇళ్లు మంజూరు చేస్తోందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రా రూ.10వేల కోట్లు ఇస్తోందని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం రూ.35వేల కోట్లు మంజూరు చేసింది, మరో రూ.25వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో పన్ను తగ్గించేది లేదని ప్రకటన ఇచ్చిన ఘనుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పెట్రో పన్నుపై భారాన్ని కేంద్ర ప్రభుత్వం సహా 23 రాష్ట్రాలు తగ్గించాయన్నారు. బాదుడులో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని సీఎం జగన్‌ ప్రకటనలు ఇస్తున్నారని ఆక్షేపించారు. పన్ను తగ్గించననే ప్రకటన సీఎం తుగ్లక్‌ తనానికి నిదర్శనమన్నారు. తెదేపా పాలనలో వ్యాట్‌ను రూ.2కి తగ్గించిన విషయాన్ని దాచి ఫేక్‌ ప్రకటన ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్రల్‌పై రూ.30, డీజిల్‌పై రూ.22 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా వ్యాట్‌ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. గత ఏడాదితో పోల్చితే పెట్రోల్‌ఫై రూ.7.59, డీజిల్‌పై రూ.5.46 వరకు పన్ను వేశారని తెలిపారు. ఫేక్‌ ప్రకటనలు మాని పెట్రోల్‌, డీజిల్‌ ధర వెంటనే తగ్గించాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు.

* ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టే ప్రభుత్వం ధాన్యం కొనలేదా?అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులు, కమీషన్లపైనే శ్రద్ధ పెట్టారని విమర్శించారు. నల్గొండలో వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నల్గొండలో రైతులు 16 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారని.. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. మద్దతు ధర రూ.1,960కి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వరి పంట వేయొద్దని ప్రభుత్వమే చెప్పడం దుర్మార్గమని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

* అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైకాపా జీర్ణించుకోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. కొవిడ్ ఆంక్షల పేరుతో పాదయాత్రను అడ్డుకోవడం సరైంది కాదని హితవు పలికారు. సీఎం జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లని నిన్న వైకాపా నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారని.. వారికి అడ్డురాని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు అడ్డొచ్చాయా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టి సీఎం జగన్‌ క్షమించరాని తప్పు చేశారని చంద్రబాబు ఆరోపించారు.

* ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్ర ఆపాలని జిల్లా ఎస్పీని వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కోరారు. ఈ మేరకు ఒంగోలులో జిల్లా ఎస్పీని ఆయన కలిశారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పాదయాత్రను అనుమతించవద్దని సుధాకర్‌బాబు విజ్ఞప్తి చేశారు. పాదయాత్రను నిలుపుదల చేయకపోతే రూట్‌ మార్చాలని కోరారు. అధికారుల చర్యలు తీసుకోకపోతే ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

* దేశ సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని చెబుతూ.. చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లీన్‌ చిట్‌ ఇచ్చారని.. దానిని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సరిహద్దుల్లోకి చైనా చొరబడలేదని ప్రపంచానికి అబద్ధం చెప్పిన భాజపా సర్కారు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మించిందని అమెరికా రక్షణ శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్‌ స్పందించింది. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా గ్రామాన్ని నిర్మించిందని అమెరికా రక్షణ శాఖ నివేదికలో చెప్పింది. సరిహద్దులో నిర్మించిన గ్రామాన్ని పౌరుల కోసమే కాకుండా ఆర్మీ కోసం చైనా వినియోగిస్తోందని తేల్చింది. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చొరబడిందని భాజపా ఎంపీ తపిర్‌ గావో స్వయంగా ప్రధానికి లేఖ రాశారు.

* దేశంలో మండిపోతున్న పెట్రో ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి, సుల్తాన్‌పూర్‌ భాజపా ఎంపీ మేనకా గాంధీ స్వాగతించారు. అదే మాదిరిగా వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలనూ తగ్గించాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి ఏశారు. యూపీలోని తన లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఆమె సుల్తాన్‌పూర్‌లో మాట్లాడారు. పెట్రో ధరల్ని కేంద్రం తగ్గించింది.. అలాగే వంటగ్యాస్‌తో పాటు ఇతర వస్తువుల ధరలనూ తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వంటగ్యాస్‌ ధరల తగ్గింపుపై కూడానిర్ణయం తీసుకోవాలన్నారు.

* ‘‘కేసీఆర్‌ను జైల్లో పెడతామని బండి సంజయ్‌ అంటున్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దమ్ము భాజపా నేతకు ఉందా? కేసీఆర్‌ని టచ్‌ చేసి చూడు.. బతికి బట్టకడతావా? మీరు ధర్నాలు చేయడం కాదు.. రేపట్నుంచి మేం ధర్నాలు చేస్తాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నా చేస్తాం. సాగు చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తాం. కేంద్రంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటాం. ఉత్తర భారత రైతులకు మద్దతుగా ధర్నాలు చేస్తాం. దిల్లీ భాజపా వరి వేయెద్దని అంటోంది… ఇక్కడ సిల్లీ భాజపా వరి వేయాలని చెప్తోంది. కేంద్రం వరి ధాన్యం కొంటుంటే నేను వద్దన్నానా? వరి కొంటామంటూ కేంద్రం నుంచి భాజపా నేతలు లేఖ తేవాలి. వానాకాలం ధాన్యం మొత్తం కొనే వరకు భాజపాను నిద్రపోనివ్వను.

* నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అంటున్నారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్‌ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్‌ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్‌ అంచనా వేసి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

* చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే అని​ పేర్కొన్నారు.

* టమాటా ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌లో శనివారం మొదటి రకం టమాటా కిలో రూ.74 పలికింది. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు అన్ని ప్రాంతాల్లో టమాటా పంట దెబ్బతింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్‌కు కేవలం 157 మెట్రిక్‌ టన్నుల సరకు మాత్రమే వచ్చింది. సరుకు తక్కువ రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు మరింత పుంజుకుంటున్నాయి.

* తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ ఇందులో పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. పల్లె వెలుగుకు కి.మీ.కు 25పైసలు.. ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

* అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి వైకాపా జీర్ణించుకోలేకపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉక్కుపాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టి సీఎం జగన్‌ క్షమించరాని తప్పు చేశారని ఆరోపించారు.

* పాపికొండల విహారయాత్ర మొదలైంది. రెండేళ్ల విరామం తర్వాత యాత్ర ప్రారంభం కావడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి ఆలయం నుంచి యాత్రికులతో 2 బోట్లు పాపికొండల విహారానికి బయల్దేరాయి. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు చాలా ఉత్సాహంగా తరలి వచ్చారు. యాత్ర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ పర్యవేక్షించారు.

* పంజాబ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. పంజాబ్‌లో పెట్రోల్‌ ధరలను రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ ప్రకటించారు. గడిచిన 70 ఏళ్లలో చమురు ధరల్ని ఈ స్థాయిలో తగ్గించడం ఇదే మొదటిసారి అని చన్నీ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లోనే అతి తక్కువ ధరలు ఉన్నాయన్నారు.

* రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతివ్వడమా లేక రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడమా.. అనేది సీఎం జగన్‌ నిర్ణయించుకోవాలని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. మహాపాదయాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడంతో జగన్ కళ్లల్లో కారం పడినట్టుగా బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. మహాపాదయాత్ర రోజురోజుకీ పెద్ద ఉద్యమంలా మారుతోందని.. రైతులు, మహిళలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

* పేరు మార్చుకొన్నా.. ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. చికాగోకు చెందిన టెక్‌ సంస్థ ‘మెటా కంపెనీ’ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఫేస్‌బుక్‌ రీబ్రాండింగ్‌ పేరిట తన పేరు(మెటా)ను, జీవనాధారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫేస్‌బుక్‌ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు.

* మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతోన్న ఈ మేధోమథన కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్‌ నేతలు, 124 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు నేరుగా హాజరయ్యారు.

* క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు కావడం వెనుక భాజపా నేత మోహిత్ కాంబోజ్‌ అనే వ్యక్తే ప్రధాన సూత్రధారి అని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. ఈ కేసు పూర్తిగా అపహరణ, డబ్బు డిమాండ్‌కు సంబంధించింది మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన తొలిరోజు నుంచి షారుక్‌ ఖాన్‌కు బెదిరింపులు మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా షారుక్‌ బయటకు వచ్చి నోరు విప్పాలన్నారు.