Health

నిమోనియా చాలా ప్రమాదకరం. ఇలా గుర్తించండి.

నిమోనియా చాలా ప్రమాదకరం. ఇలా గుర్తించండి.

నిమోనియా అన్నది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్‌ అనే విషయం తెలిసిందే. గతంలో వచ్చిన నిమోనియాలతో పోలిస్తే 2020, 2021ల్లో వచ్చిన నిమో నియాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గతేడాదీ, ఈ ఏడాదీ కోవిడ్‌ విజృంభించి చాలామంది ప్రాణాలు తీసింది. నిజానికి కరోనా ఆ ప్రాణాలను బలిగొనలేదనీ, కోవిడ్‌ కారణంగా సెకండరీ ఇన్ఫెక్షన్‌గా వచ్చిన నిమోనియా అనేక మంది ఉసురు తీసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల (నవంబరు) 12న ‘ప్రపంచ నిమోనియా డే’ సందర్భంగా ఆ ఆరోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.

ఇన్ఫెక్షన్ల విషయంలో అన్నింటికంటే ఎక్కువ ప్రాణాలు తీసేది ‘నిమోనియా’. 2019లో అది 25 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 6.72 లక్షలు చిన్నారులు కావడం విషాదం. పైగా ఇందులోనూ చాలా ఎక్కువ మంది ఐదేళ్ల వయసు కంటే తక్కువ చిన్నారులే. అగ్నికి ఆజ్యంలా… కోవిడ్‌ తోడుకావడంతో ఒక్క గతేడాది లెక్కలే చూస్తే… ఎప్పుడూ నమోదయ్యే నిమోనియా మృతులకు అదనంగా 19 లక్షల మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఓ అంచనా.

నిమోనియాని పూర్తిగా నయం చేసేలా ఖచ్చితమైన చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ ఇన్ని మరణాలు నమోదవుతున్నాయంటే పైన పేర్కొన్న గణాంకాలతో దాని తీవ్రత తేటతెల్లమవుతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), యూనిసెఫ్‌ తమదైన ఓ లక్ష్యంతో ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించాయి. ప్రతి దేశంలోనూ 2025 నాటికి నిమోనియా మరణాల సంఖ్యను ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో కేవలం ముగ్గురికి తగ్గించాలన్నదే ఆ గ్లోబల్‌ యాక్షన్‌ ప్లాన్‌ లక్ష్యం.

వ్యాధి నిర్ధారణ
►రోగిలో కనిపించే లక్షణాలతో
►సీబీపీ, సీఎక్స్‌ఆర్‌ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.
►ఒక్కోసారి వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె/గల్ల/తెమడ పరీక్ష వంటి పరీక్షలూ అవసరం కావచ్చు.

నివారణ…
►పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు.
►పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్‌ కూడా.
►పొగ వాతావరణానికి ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి.
►ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్‌ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి.
►క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు అంత త్వరగా రావు.
►పోషకాలన్నీ ఉండేలా సమతులాహారం తీసుకోవాలి. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతంది. అది నిమోనియాతో పాటు అనేక రకాల ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది.

నిమోనియాకు తక్షణం చికిత్స
అవసరం… లేదంటే… పైన పేర్కొన్న అనేక కారణాల్లో దేని వల్ల నిమోనియా వచ్చినప్పటికీ చికిత్స తీసుకోకపోతే బాధితుడి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. ఫలితంగా ఇతర కాంప్లికేషన్లు వస్తాయి. ఉదాహరణకు… మూత్రపిండాలు దెబ్బతినడం, పక్షవాతం, సెప్టిసీమియా (అంటే రక్తానికి ఇన్ఫెక్షన్‌ సోకి, అది విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, మెదడుపై దుష్ప్రభావం వంటి కాంప్లికేషన్లు రావచ్చు. ఒక్కోసారి మరణం సంభవించడం కూడా నిమోనియా కేసుల్లో తరచూ కనిపిస్తుంటుంది.

అన్ని వయసుల వారిలోనూ…
చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకు నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చిన్నారులూ, వృద్ధుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ కాబట్టి వారిలో ఇది కనిపించడం చాలా సాధారణం.

ఈ సమస్యలుంటే మరింత అప్రమత్తత తప్పదు
►సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) ఉన్నవారు
గుండె సమస్యలు ఉన్నవారు
►స్పీన్‌ తొలగించిన వాళ్లు
►పొగతాగేవారు
►ఇక క్యాన్సర్‌ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్‌ రోగులు, ఆస్తమా ఉన్నవారిలో నిమోనియా రావడం మిగతావాళ్ల కంటే కాస్తంత ఎక్కువే. అలాగే సాధారణంగా గర్భవతుల్లో నిమోనియాను గుర్తించాక, సరిగా వైద్య చికిత్స అందివ్వకపోతే, వారిలో అది మరెన్నో సమస్యలకు దారితీసే ముప్పు పొంచి ఉంటుంది.

చికిత్స
నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. దాని మోతాదును జాగ్రత్తగా నిర్ణయించి డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలి.
ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో… మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే. వారు వీలైనంత త్వరగా ఫిజీషియన్‌/మెడికల్‌ స్పెషలిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన అన్ని పరీక్షలూ చేయించుకోవాలి.
ఇవీ కారణాలు
ఇటీవల విస్తరించిన, ఈ ఏడాది కూడా రెండోవేవ్‌తో స్వైరవిహారం చేసిన కరోనా వైరస్‌ ఓ ప్రధానమైన కారణమే అయినప్పటికీ… ఇది మాత్రమేగాక నిమోనియాకు ఎన్నో కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఇవే…
►బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియా, హీమోఫీలస్‌ (మొదటిది పెద్దల్లో, రెండోది పిల్లల్లో నిమోనియాకు కారణమవుతుంది). అవే కాకుండా… గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.
►ఫంగస్‌ వల్ల
►కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్‌ క్రౌడింగ్‌). ఇప్పుడు వ్యాప్తి చెందే కరోనా, ఇంకా అన్ని వైరస్‌లతో పాటు, నిమోనియాకి కూడా ఓవర్‌ క్రౌడింగ్‌ ఓ ప్రదాన కారణం. అందుకే గుంపుల్లోకి వెళ్లడం నివారించాలి. ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్‌ తప్పదు.
►మైక్రో యాస్పిరేషన్‌ – ఒక్కోసారి తినే, తాగే సమయాల్లో మనకు తెలియకుడానే కొన్ని పదార్థాలూ, ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్‌ అంటారు.
►ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్‌ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.
►ఆల్కహాల్‌ – దీనితో మనుషుల్లో రోగనిరోధక శక్తి (డిఫెన్స్‌ మెకానిజం) తగ్గుతుంది. ఉదాహరణకు మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.

నిమోనియా లక్షణాలివే…
►దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, చలిగా అనిపించటం, కొందరిలో ఆకలి లేకపోవడం
►కఫం పడవచ్చు లేదా పడకపోవచ్చు. పడితే అది… తెల్లగా, పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.
►నిమోనియా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆయాసం రావచ్చు.
►నిమోనియా ఊపిరితిత్తి పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.
ఇంటస్టిషియల్‌ నిమోనియాలో అనే తరహా రకంలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. దాంతోఒక్కోసారి శ్వాసప్రక్రియ పూర్తిగా ఆగిపోవచ్చు కూడా.
►ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం… గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని ‘ఎగ్జుడస్‌’ అనే వ్యర్థాల అడ్డంకి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఆక్సిజన్‌ చేరదు. దాంతో దేహానికి అవసరమైనంత ఆక్సిజన్‌ అందదు. దాంతో ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితికి వస్తాయి. దీన్నే ‘హైపాక్సిక్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌’ అంటారు.
►ఊపిరి అందకపోవడంతో చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె వేగం పెరగడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్‌ నిమోనియా’ అంటారు.