Food

టిఫిన్‌కి కీమా బోండా ఎలా ఉంటుందంటారు?

టిఫిన్‌కి కీమా బోండా ఎలా ఉంటుందంటారు?

మార్నింగ్‌ టిఫిన్‌ గా ఈ కొత్త వంటకాలను ప్రత్నించండి.. మీ ఇంటిల్లిపాదికి కొత్త రుచులను పరిచయం చేయండి.

కీమా బోండా

కావలసిన పదార్థాలు
కీమా – పావు కిలో (ఉప్పు, కారం, మసాలా దట్టించి కుకర్‌లో విజిల్స్‌ వచ్చేవరకూ ఉంచాలి)
జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు – అర టీ స్పూన్‌ చొప్పున
పచ్చిమిర్చి – 2 (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి)
కరివేపాకు తురుము – కొద్దిగా
ఉల్లిపాయలు – 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి)
బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి)
ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు
గరం మసాలా – 1 టీ స్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్ట్‌– అర టీ స్పూన్‌
కొత్తిమీర తురుము – కొద్దిగా
శనగపిండి – 3 టేబుల్‌ స్పూన్లు
బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు
బేకింగ్‌ సోడా, కారం – అర టీ స్పూన్‌ చొప్పున
బంగాళదుంప గుజ్జు – పావు కప్పు (ఉడికించినది)
నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
ముందుగా పాన్‌లో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తురుము, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, బంగాళదుంప గుజ్జు, కీమా, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్‌ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్‌ సోడా, కారం వేసుకుని నీళ్లు పోసుకుని పలచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కీమా–బంగాళదుంప మిశ్రమాన్ని బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచి, బూరెలు మాదిరిగా కాగుతున్న నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

పనీర్‌ రోటీ రోల్స్‌

కావలసిన పదార్థాలు
పనీర్‌ ముక్కలు – 1 కప్పు
ఓట్స్‌ – 2 కప్పులు (పిండిలా మిక్సీ పట్టుకోవాలి)
జొన్నపిండి – పావు కప్పు
నెయ్యి – 1 టేబుల్‌ స్పూన్‌
గోరువెచ్చని నీళ్లు – సరిపడా
గరం మసాలా, కారం – 1 టీ స్పూన్‌ చొప్పున
పసుపు – కొద్దిగా
ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు (సన్నగా పొడవుగా తరగాలి)
టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున
కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా

తయారీ విధానం
ముందుగా పనీర్‌ ముక్కలకు గరం మసాలా, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో ఓట్స్‌ పిండి, జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్‌ ఆన్‌చేసి.. కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని దోరగా వేయించి, పనీర్‌ మిశ్రమాన్నీ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మరోవైపు ఓట్స్‌ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, పెనం మీద ఇరువైపులా దోరగా వేయించుకుని, ప్రతి రోటీలో కొద్దికొద్దిగా పనీర్‌ మిశ్రమాన్ని పెట్టుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి.