* ఎన్నో అంచనాల మధ్య స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్ మదుపర్లకు నిరాశ మిగిల్చింది. లిస్టింగ్ రోజైన గురువారం ప్రారంభంలోనే 9 శాతం మేర క్షీణించిన షేరు విలువ.. ట్రేడింగ్ ముగిసేనాటికి 27 శాతం మేర పడిపోయింది. ఇష్యూ ధర రూ.2,150 కాగా.. బీఎస్‌ఈలో ఆరంభంలోనే రూ.1955 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ట్రేడింగ్ ముగిసేనాటికి 27.25 శాతం క్షీణించిన షేరు విలువ రూ.1564కు పరిమితమైంది. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ 1,950 వద్ద ప్రారంభమైన షేరు విలువ ట్రేడింగ్ ముగిసే నాటికి 27.34 శాతం క్షీణించి రూ.1562కి పరిమితమైంది. ఓ వైపు కంపెనీ షేరు విలువ క్షీణించినప్పటికీ కంపెనీ మార్కెట్ విలువ మాత్రం రూ.లక్ష కోట్లు దాటింది. గురువారం మధ్యాహ్నం కంపెనీ మార్కెట్ విలువ బీఎస్‌ఈలో రూ.1,01,484.00 (లక్ష కోట్లు)గా నమోదైంది. ఇటీవల ఐపీవోకు వచ్చిఇన జొమాటో (1.22 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే అయినప్పటికీ.. మరో కంపెనీ నైకా (1.01 లక్షల కోట్లు) కంటే కాస్త ఎక్కువగా ఉండడం గమనార్హం. రూ.18,300 కోట్ల సమీకరణే లక్ష్యంగా పేటీఎం నిర్వహించిన ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి. కేవలం భారత్‌లోనే కాదు.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇదే అతిపెద్ద ఐపీవో. దీని కంటే ముందు మన దేశంలో 2010లో కోల్ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీవోనే ఇప్పటి వరకు అతిపెద్దది. షేరు విలువ పడిపోవడానికి కారణాలివేనా…?
* పేటీఎం షేరు విలువను అధికంగా నిర్ణయించడం వల్లే లిస్టింగ్ రోజు షేరు విలువ పడిపోవడానికి కారణమని మార్కెట్ అనలిస్టులు చెబుతున్నారు.
* పేటీఎంకు చెందిన ప్రమోటర్లలో 75 శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారే కావడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీవోలో వీరి వాటానే రూ.10వేల కోట్లకు పైగా ఉండడం గమనార్హం.
* వన్97 కమ్యూనికేషన్ అనుసరిస్తున్న వ్యాపార నమూనాకు ఒక దిశ అంటూ ఏదీ లేదని విదేశీ బ్రోకరేజీ సంస్థ మాక్వరీ తప్పుబట్టింది. కంపెనీ లాభదాయకత సాధించడం అంత సులువేమీ కాదని పేర్కొనడం కూడా షేరు విలువపై ప్రభావం చూపించింది.
* బిల్ పేమెంట్స్, రీఛార్జి వంటి ఆర్థిక సేవలు అందిస్తున్న పేటీఎం.. మార్కెట్‌లో ఒక పోటీ సంస్థగా ఉందే తప్ప మార్కెట్‌లో అగ్రగామిగా లేదు. ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటివి గట్టి పోటీనిస్తుండడంతో మదుపర్లు పేటీఎం షేరును కొనుగోలుకు ఆసక్తి చూపలేదనేది విశ్లేషకుల మాట.
* చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ స్కోడా గురువారం భారత విపణిలో స్లావియా సెడాన్ కారును ఆవిష్కరించింది. ప్రతియేటా 15 లక్షల కార్లు విక్రయించాలన్న స్కోడా తన స్ట్రాటర్జీ 2030 వ్యూహానికి అనుగుణంగా దీర్ఘ కాలిక లక్ష్య సాధనలో స్లావియా సెడాన్ కారు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఇక స్లావియా కారు కొనుగోలు చేయాలని ఆసక్తి గల కస్టమర్లు రూ.11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్లావియా సెడాన్‌ను వినియోగదారులకు డెలివరీ చేయనున్నారని భావిస్తున్నారు.
* ప్రభుత్వరంగ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఐపీవోకు రానుందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతపాండే తెలిపారు. వీటితో పాటు పలు పీఎస్‌యూలను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ మేరకు సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ సమ్మిట్‌లో బుధవారం మాట్లాడారు.
* దేశ ఆర్థికాభివృద్ధిలో.. ఉద్యోగ కల్పనలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘క్రియేటింగ్ సినర్జీస్ ఫర్ సీమ్‌లెస్ క్రెడిట్‌ఫ్లో అండ్ ఎకనామిక్ గ్రోత్’ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన గురువారం ప్రసంగించారు. బ్యాంకులకు ప్రభుత్వం నుంచి వీలైనంత మద్దతు ఇస్తామని ప్రకటించారు. గత 6-7ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా నేడు బ్యాంకింగ్ రంగం బలపడిందన్నారు. మొండిబకాయిల వసూళ్లలో మంచి పురోగతి సాధించిందని ప్రశంసించారు. రూ.5 లక్షల కోట్లకుపైగా బకాయిలను వసూలు చేశాయన్నారు.