DailyDose

మన చుట్టూ ఉన్న ఒంటరి భామ్మలు తాతలకు ఇది అంకితం

మన చుట్టూ ఉన్న ఒంటరి భామ్మలు తాతలకు ఇది అంకితం

మన చుట్టూ ఉన్న ఒంటరి బామ్మలు, తాతలకు ఇది అంకితం!!

“ఏరా మనవడా ఏం చేస్తున్నావు” వంగబడిపోయిన నడుంని ఏం చెయ్యలేక, భూతద్దం లాంటి కళ్లజోడు లోంచి పోలికలు సరిచూసుకుంటూ పలకరించింది ఓ బామ్మ.

ఏదో మాట కలపడానికి అడిగిందే గానీ ఆమెకు అర్థమయ్యే యవ్వారాలు కావు. ఓ మనిషితో మాట్లాడటమే ఆమెకి కావాలి. అక్కడ నువ్వూ, నేనూ కాకుండా ఓ పదేళ్ల పిల్లాడున్నా. “ఊకే గాలి తిరుగుళ్ల తిరక్కపోతే బుద్ధిగా కూర్చుని చదూకోచ్చుగా” అని తనకి తోచిన ఉచిత సలహా పడేస్తుందామె!

అక్కడక్కడ పెంకులూడిపోయి శిధిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కట్టే ఉంటోంది. “ఇలా ఒక్కదానివే ఉండకపోతే హైద్రాబాద్ నీ కొడుకు దగ్గరకు వెళ్లొచ్చుగా బామ్మా” అని అంటే చాలు. “నేనెందుకు చెప్పు వాళ్లకి ఓ గుదిబండలా, ప్రాణం గుటుక్కుమనే దాకా కృష్ణారామా అంటూ వెళ్లదీయడమే” అని బదులిస్తుంది.

“ఓ చుక్క మంచి నీళ్లు తాగి వెళుదువు గాని లోనికి రా. ” అంటూ కాస్త బలవంతమే పెడుతుంది. ఓ వార కుంగిపోయిన ఐరన్ కూర్చీలో ఎక్కడ విరిగిపోతుందో అని భయం భయంగా కూర్చోగానే.

ఓ మూలన ఉన్న ఓ ప్లేట్‌ని చివికిపోయిన చీరకొంగుతో దుమ్ము దులిపి, అక్కడే స్టూల్ మీదున్న ఓ టిఫినీ మూత కష్టంగా తీసి, నాలుగు కారపు చెక్కలు ప్లేట్లో పెట్టి. “రాక రాక వచ్చావు, నీకు టీ, కాఫీ చేసే సత్తువ కూడా లేదు, కాస్త ఇవైనా ఎంగిలిపడు నాయనా” అంటూ తీసుకొచ్చి ముందు పెడుతుంది.

అసలే నగరంలో హైజనిక్‌గా బ్రతుకుతున్న జీవనశైలి. ఆ చీరతో ఆమె తుడిచిన విధానానికి, వర్షాకాలానికి ముక్కు వాసన వస్తున్న ఆ కారపు చెక్కలు తినలేక ఓ చిన్న ముక్క కొరికి. “ఆకలి లేదులే బామ్మా, పనుంది బయల్దేరతాను, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో” అంటాం.

“నా ఆరోగ్యందేముందిలే ఎప్పుడు పిలుస్తాడా అని కాచుక్కూర్చున్నాను, అమ్మాయిని అడిగానని చెప్పు” అని బదులిచ్చిందామె.

ఒక్కటే ఉంటుంది. పలకరించే వాళ్ళు ఉండరు, వంట వడుకునే సత్తువుండదు, ఏ పచ్చడి ముద్దో, పక్కింటోళ్లు ఎప్పుడైనా ఇచ్చే కూరతోనో బ్రతికేయడమో!

ఒంటరితనమంటే భయం లేదు. నావాళ్లంటూ ఎవరూ ఉండరు. బ్రతుకుపై ఆశ లేదు.

సాయంత్రానికి ఓ పాతకాలం ఎర్ర లైటు కింద కూర్చుని విష్ణు సహస్రనామం పుస్తకం పట్టుకుని, ఆ భూతద్దాల్లోంచి అక్షరాలు తడుముకుంటూ చదువుకుంటూ ఓ ఒంటరి పక్షిగా ఉండిపోతుంది.

అలా ఎవరికీ అక్కర్లేకుండా నెలలు గడిచీ, గడిచీ, ఉండగా ఏ అర్థరాత్రో ఆమె వేచి చూసినట్లే దేవుడు పిలుస్తాడు. ఊపిరాగుతుంది. పక్కింటి వాళ్లు ఎంతకీ పలక్కపోయేసరికి, సందేహమొచ్చి చూసి, పట్నంలో ఉన్న కొడుకులు, కూతుళ్లకి ఫోన్లు చేస్తే హడావుడిగా వాళ్లు ఊరెళ్లి కాటికి సాగనంపి వస్తారు.

ఇలాంటి బామ్మలు, తాతలు ప్రతీ ఊళ్లో ఉన్నారు. ఎంత వరకూ మన బ్రతుకులు, మన కష్టాలేనా. కనీసం ఊరెళ్లినప్పుడైనా వాళ్లని ఇంటికెళ్లి మరీ పలకరించి రండి!