పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన ఉన్నతికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పారు. సీజేఐ స్వగ్రామం పొన్నవరంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుంబంధముందన్నారు. పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని.. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, పొలాలు, చెరువులు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. రైతులు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారికి గిట్టుబాటు ధరలేకపోవడం, భూములకు సంబంధించిన సమస్యలూ ఉన్నాయన్నారు. తెలుగువాడిగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే ప్రజలందరి అభిమానం, ఆశీస్సులతోనేనని.. దీన్ని మర్చిపోనని చెప్పారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదన్నారు. తెలుగు ప్రజలు గర్వపడేలా.. తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తానన్నారు. దీనికి భిన్నంగా ప్రవర్తించబోనని మాటిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీకి పోయినా ఈ పల్లెను గౌరవిస్తా. ఆర్భాటంగా ఉండని స్కూలులో చదివాను. నాకు పదేళ్లు వచ్చేసరికే మా ఊర్లో మూడు ప్రధాన రాజకీయపార్టీలు ఉండేవి. మా తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటే నేను స్వాతంత్య్ర పార్టీకి మద్దతిచ్చా. కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశాం. చిన్నతనంలో ఎన్జీరంగా మీటింగ్లకు వెళ్లా. అప్పట్లో ఈ ప్రాంతం దుర్భిక్ష మెట్టప్రాంతంగానే ఉంది. నేటికి మా ప్రాంతం అనుకున్న అభివృద్ధి సాధించకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఢిల్లీలో తెలుగువాడినని చెపితే అక్కడివారు తమ ప్రాంతంలో పలు ప్రాజెక్ట్లు కట్టారని చెపుతారు.రైతులకు కనీస మద్దతు ధర, భూవివాదాలు వంటి ఇబ్బందులు అలాగే ఉన్నాయి. దేశం అన్ని రంగాలలోనూ ముందుకెళ్తోంది. సమస్యలను అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం తెలిపేలా, గర్వించదగిన విధంగా ప్రవర్తించాలి. ఢిల్లీలో చాలా సభల్లో తెలుగువాడి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు’’ అని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
ఎడ్లబండిపై ఊరేగించి…పూలవర్షం కురిపించి…CJIకి ఆత్మీయ మన్నన
