ఆకాశాన్నంటిన పెట్రోల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేలా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన చేశారు. లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.25ల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కాకపోతే ఈ అవకాశం కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నానాటికీ పెరిగిపోతున్న పెట్రో ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేదలు తన ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నప్పటికీ పెట్రో భారాన్ని భరించలేక దాన్ని వినియోగించలేకపోతున్నాడు. అంతేకాకుండా తన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించేందుకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అందుకే నేనో నిర్ణయం తీసుకున్నా. రేషన్ కార్డు కలిగిన ద్విచక్రవాహనదారులు తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్లలో పెట్రోల్ పోయించుకుంటే ఒక్కో లీటర్‌కు ₹25ల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తాం. ఇది 2022 జనవరి 26 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రతి పేద కుటుంబం నెలకు 10 లీటర్ల వరకు రీయంబర్స్‌మెంట్ పొందొచ్చు’’ అని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.98.52లుగా ఉంది.