భారత్‌లోకి టెస్లా కార్ల ప్రవేశంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే భారత్‌కు టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్ ట్విటర్లో ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు ప్రభుత్వం ఖండించింది. సోషల్ మీడియా ద్వారా మస్క్.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది.
భారత మార్కెట్లో టెస్లా కార్ల విడుదలపై ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా ఎలాన్ మస్క్‌ను అడిగారు. ‘‘టెస్లా విడుదలపై అప్డేట్ ఉందా? ఈ కార్లు చాలా బాగుంటాయి. ప్రపంచంలోని ప్రతిచోటా వీటిని విడుదల చేయాలి’’ అని సదరు నెటిజన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటికీ దీనిపై ప్రయత్నాలు సాగిస్తున్నాం’’ అని అన్నారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ భారత ప్రభుత్వానికి ప్రతికూలంగా ట్వీట్లు చేశారు. దీంతో ఇది కాస్తా కొత్త వివాదానికి దారి తీసింది.
మస్క్ ఆరోపణలు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సోషల్‌మీడియా ద్వారా మస్క్ భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఇలాంటి ట్రిక్స్‌కు ప్రభుత్వం ఎన్నడూ తలొగ్గదని సదరు వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌లో టెస్లా కార్లను తయారుచేసే అంశంపై ఎటువంటి హామీ ఇవ్వకుండానే దిగుమతి సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోందని తెలిపాయి. ఆటోమొబైల్ రంగానికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ ప్రోత్సాహకాలను ఇస్తోందని, ఒక వేళ టెస్లా ఇక్కడే కార్లను తయారుచేస్తే.. ఎంతో లబ్ధిపొందొచ్చని ఆ వర్గాలు సూచించాయి.
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విపణి కలిగిన భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. నిజానికి 2019 జనవరిలోనే ఈ కార్లను తీసుకురావాలని మస్క్ భావించినా.. మూడేళ్లు గడిచినా అది సాధ్యం కాలేదు. ఇందుకు మస్క్ విధించిన షరతే కారణమని తెలుస్తోంది. తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, తర్వాతే తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్ షరతు పెట్టారు. దీంతో పాటు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని కూడా తగ్గించాలని కోరారు. ఈ మేరకు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీనిపై ప్రభుత్వం, టెస్లా మధ్య అనేకసార్లు చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.