ప్రకృతి శక్తులు ప్రణమిల్లు…
దేశమంతా శోభిల్లు!
పలు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఇలా
వివిధ పేర్లతో వేడుకలు
సూర్యుడు ఏడాదిలో పన్నెండు నెలల్లో పన్నెండు రాశుల్లో సంచరిస్తాడు. మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణమని ఆ రోజు చేసుకునే పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తారు. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. తెలుగు వారి పండుగగా సంక్రాంతిని అభివర్ణిస్తారు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పర్వదినాన్ని వివిధ పేర్లతో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.
**అంతటా కళకళ ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండుగగా సంక్రాంతిని చేసుకుంటారు. తెలుగు వారి పెద్ద పర్వదినంగా గుర్తింపు పొందిన సంక్రాంతి రోజున ప్రతి లోగిలి మెరిసిపోతుంది. పూల అలంకరణలతో అలరారే రంగవల్లులు, వాటిపై కొలువైన గొబ్బెమ్మలతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలను ధరించి మెరిసిపోతుంటారు. మంచుతెరల్ని చీల్చుకు వచ్చే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లుతాయి. నోరూరించే పిండివంటల ఘుమఘుమలు సరేసరి. తెలుగు ప్రజల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా సంక్రాంతి పండుగంటే ఆనంద డోలికల్లో తేలిపోతారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ పేర్లతో వ్యవహరిస్తారు.
**తమిళనాడులో
థై పొంగల్‌తమిళనాడులో పండుగను నాలుగు రోజులు చేసుకుంటారు. రెండో రోజున థై పొంగల్‌ను తమిళ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున కొత్త పాత్రలో పాత బియ్యం, బెల్లం, పాలు కలిపి పొయ్యిమీద పొంగించి, ఆ తర్వాత నైవేద్యం చేసి, సూర్యుడికి సమర్పిస్తారు. అన్ని జీవరాసుల జీవితాల్లోనూ నిరంతరం వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి కృతజ్ఞత పూర్వకంగా ఈ పండుగను భావిస్తారు. తర్వాత రోజున పశువులను పూజిస్తారు.
**పంజాబ్, కశ్మీర్‌లో లోహ్రిపంజాబ్, కశ్మీర్ రాష్ట్రాల్లో సంక్రాంతిని లోహ్రి పండుగగా నిర్వహిస్తారు. వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్‌లో భోగి రోజున మంటల్లో చెరకు గడలు, మిఠాయిలు, బియ్యం వేస్తారు. ఆ మంటల చుట్టూ భాంగ్రా నృత్యం చేస్తారు. సంక్రాంతి రోజున నదీ స్నానం ఆచరించి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఖీర్, పాప్‌కార్న్‌ను సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కశ్మీర్‌లో పవన్ యజ్ఞాస్ పేరుతో భోగి మంటలు వేస్తారు. సంక్రాంతి రోజున నువ్వులు, పల్లీలు, బెల్లం కలిపి చేసే పదార్థాల్ని నైవేద్యంగా పెడతారు.
**కేరళలో
మకర విళక్కుకేరళలో సంక్రాంతి రోజున మకర విళక్కును ఘనంగా నిర్వహిస్తారు. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. ఈ సందర్భంగా కొబ్బరితోటల్లో పూజలు చేస్తారు. అనంతరం మిఠాయిలు పంచి పెడతారు.
**మధ్యప్రదేశ్‌లో
సుఖరాత్‌మధ్యప్రదేశ్‌లో సంక్రాంతి పర్వదినాన్ని సుఖరాత్‌గా వ్యవహరిస్తారు. వేకువ జామున స్నానం ఆచరిస్తారు. అనంతరం గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. కొత్తపంటల్ని ఇంటికి తీసుకొచ్చి పిండి వంటలు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. రకరకాల మిఠాయిలను పంచుకోవడం సుఖరాత్ ప్రత్యేకత.
**మహారాష్ట్రలో..మహారాష్ట్రలో సంక్రాంతి పేరుతోనే వేడుకలు నిర్వహిస్తారు. తిల్‌గుల్ పేరిట నువ్వులతో చేసిన రంగురంగుల హల్వాను పంచుకోవడం ఇక్కడ ఆనవాయితీ. కొత్తగా పెళ్లయిన మగువలకు పసుపు కుంకుమలతో పాటు తాంబూలాలతో బహుమతులు అందిస్తారు. ఈ సంప్రదాయాన్ని హల్ధీకుంకుమ్ అని అభివర్ణిస్తారు.
**ఉత్తరప్రదేశ్‌లో
కిచెరీ ఉత్తరప్రదేశ్‌లో కిచెరీ పేరుతో పండుగ చేసుకుంటారు. గంగ, యమున, సరస్వతి నదీ సంగమమైన అలహాబాద్‌కు రాష్ట్రం నలు మూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వారంతా నదీస్నానాలు ఆచరిస్తారు. నూతన వస్త్రాలు ధరించి, పిండి వంటలు, మిఠాయిలను బంధువర్గాలకు పంచి పెట్టి పండుగ చేసుకుంటారు.
**రకరకాల పేర్లతో..
కర్ణాటకలో సుగ్గీ, ఒడిశాలో సంక్రాంతి, పశ్చిమబంగలో పోష్ సంక్రాంతి, అసోంలో మాఘ్‌బిహూ, మహర్‌దొమిహి పేర్లతోనూ… దిల్లీ, జార్ఖండ్, హరియాణా, బిహార్‌లలో సక్రాత్, గోవాలో సంక్రాంత్, గుజరాత్‌లో ఉత్తరాయణ్ సంక్రాంతి, హిమాచల్ ప్రదేశ్‌లో మఘసాజీ అని… ఇలా పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పర్వదినాన్ని చేసుకుంటారు. మూడునాలుగు రోజులు అంతా ఆనందంగా గడుపుతారు.