Health

హితమిత సమయభుక్

Healthy Proportionate Timed Meals Are The Key To Good Health

హిమాలయం నుంచి బయలుదేరిన రెండు పక్షులు ‘కోరుక్’- కః అరుక్- (ఎవరు రోగికాదు?)- అని అరచుకుంటూ కేరళ వరకు విహరించాయట! వందలాది ప్రదేశాలలో వైద్యుల ఇళ్లవద్ద, విజ్ఞుల ఇళ్లవద్ద, ప్రముఖుల ప్రాంగణాలవద్ద, సామాన్యుల ముంగిళ్లవద్ద ఈ జంట పక్షులు ఆగాయి… ‘కోరుక్?’’-అని అరిచాయి. అర్థంకాని అందరూ ఆ పక్షులను తరిమివేశారు.కేరళ ప్రాంతంలోని ఒక నదీతీర గ్రామంలో ఒక వైద్యుడు ఇంటి బయట చెట్లమధ్య పువ్వుల పరిమళాల మధ్య కూచుని ‘కల్వం’లో మందులను నూరుతున్నాడు!అక్కడికెల్లి ఈ పక్షులు కూచున్నాయి! మళ్లీ యధావిధిగా అరిచాయి! ‘‘కోరుక్?’’అన్న పక్షులకు సమాధానంగా ఆ వైద్యుడు ‘‘హితభుక్’’- మంచి పదార్థాలను తినేవాడు రోగికాడు- అని అరిచాడట! ఆ పక్షులు రెండవసారి కూడ ‘‘కోరుక్’’అని అరిచాయి! ‘‘మితభుక్’’- మితముగా తినేవాడు! అని వైద్యుడు సమాధానం చెప్పాడు.ఆ పక్షులు మళ్లీ ‘‘కోరుక్’’అని అరిచాయట! ‘‘సమయభుక్’’ అని వైద్యుడు సమాధానం చెప్పాడు. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో భోజనం చేసేవాడు రోగగ్రస్తుడుకాడు! పక్షులు ఇంకొకసారి కూడ ‘‘కోరుక్’’ అని అరిచాయట! ‘‘హితమిత సమయభుక్’’అని వైద్యుడు ముక్తాయించాడు! హితంగా, మితంగా, సమయానికి తినేవాడు రోగగ్రస్తుడు కాడు…!

సంతృప్తిచెందిన పక్షులు మళ్లీ హిమాలయంల వైపు పయనం సాగించాయి. ఆ పక్షులు అశ్వనీ దేవతలు అన్నది ఆ వైద్యుల నిర్ధారణ!! ప్రముఖ వైద్య శాస్తజ్ఞ్రుడు స్వర్గీయ ఇటికాలపాటి సంజీవరావు చెప్పిన సనాతన జీవనరీతి ఇది!ఈ రీతి భ్రష్టుపట్టిపోవడంవల్లనే ఆధునిక సమాజాన్ని రోగాలు అలముకుంటున్నాయి. ఈ రోగాలను నయంచేసే ‘ప్రక్రియ’ బహుళజాతీయ వాణిజ్యసంస్థల దోపిడీకి ఆలవాలమైపోయింది! ఈ ప్రక్రియ కూడ ‘కల్తీ’అయిపోయింది! ‘రుక్కు’అని అంటే ‘రోగం’, ‘ఋక్కు’అని అంటే వేదం! ‘‘ఋగ్వేదాన్ని’’ ‘‘రుగ్వేదం’’గాను, ‘‘ఋత్విక్కుల’’ను ‘‘రుత్విక్కులు’’గాను వ్రాసి భాషను ‘సైతం’‘కల్తీ’ చేయడం భావదాస్యగ్రస్తుమైన జీవన నీతికి పరాకాష్ఠ..! తిండి కల్తీకావడానికి ప్రాతిపదిక మన సమష్టి స్వభావం ‘కల్తీ’కావడం!! పిల్లలు, వృద్ధులు రోగులు కాయకష్టంచేసే శ్రమ జీవనులు ఎక్కువసార్లు తినవచ్చు… కానీ ఆరోగ్యవంతులైన మిగిలినవారు రోజునకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలన్నది భారతీయ సనాతన జీవన రీతి! కానీ ఎక్కువసార్లు ఇలా తినకూడని వారు ‘‘మేము సంపాదిస్తున్నాం… మేము తింటున్నాం’’ అన్న అహంకారంతో రోజంతా తింటూనే ఉన్నారు. ఎన్నిసార్లు తిన్నప్పటికీ జీర్ణించుకోగలిగిన శరీర శ్రమజీవులకు మాత్రం రెండుపూటల తిండి కూడ దొరకని వికృత జీవనరీతి విస్తరించిపోతోంది…!ఆర్జించేవారు ఆరగించడం ‘ప్రకృతి’! ప్రకృతిలోని సమస్త జీవజాలం ఈ పనిచేస్తోంది!
ఇతరుల నోరు కొట్టి తినేయడం మానవులకుమాత్రమే పరిమితమైన ‘వికృతి’! ఆర్జించేవారు ఇతరులను ఆదరించడం మానవులకు సాధ్యమైన ‘సంస్కృతి!’ ‘‘తినడం’’ ఇలా ప్రకృతి, ఇతరుల తిండిని దోచుకోవడం“వికృతి” తినిపించడం’’ సంస్కృతి! మరి పైమూడింటిలో మన జీవన రీతి ఏది?మనమే నిర్ణయ్ంచుకోవచ్చు!