DailyDose

TNI నేటి తాజా వార్తలు 01/02/2022

TNI నేటి  తాజా  వార్తలు 01/02/2022

* కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం – ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ‘ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్‌వేర్‌ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌(NGDRS)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

* APలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించడం జరిగింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. జనవరి 18 నుంచి 31 వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కాగా నిన్నటితో గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏప్రిల్ 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

* ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం గ్రామంలో సోమవారం రేసింగ్‌ పావురం కన్పించింది. సర్పంచ్‌ వాకదాని కన్నయ్య ఇంటి వద్ద పావురం కన్పించటంతో ఆహారం అందించారు. పావురం కాలికి ట్యాగ్‌లు ఉండటంతో గ్రామస్థులు విచిత్రంగా చూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన రేసింగ్‌ పావురంగా గ్రామస్థులు గుర్తించారు. దొరికిన పావురాన్ని బోనులో ఉంచి సర్పంచ్‌ కన్నయ్య ఇంటి వద్దే ఆహారాన్ని అందజేస్తున్నారు.

* పీఆర్సీలో జీతాలు తగ్గాయంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వెయ్యాలని ప్రభుత్వానికి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. పీఆర్సీపై నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వలేదని న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. జీవోల్లో ఎరియర్స్ కట్ చేయటాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా… ఈ వ్యవహారంలో అనేక అంశాలు ముడిపడి ఉండటంతో ప్రభుత్వం సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. పీఆర్సీలో జీతాలు తగ్గాయని హైకోర్టులో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

* ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగానే చలో విజయవాడ కార్యక్రమం చేపట్టామని పీఆర్సీ సాధన సమితి నేత దివాకర్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జీతాలు పెరగాయంటూ ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతీస్తోందన్నారు. గత్యంతరం లేకనే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందన్నారు. విజయవాడ పురవీధుల్లో ఉద్యోగుల సత్తా చాటుతామన్నారు. జీతాలు పెరగాయని ప్రభుత్వం చెప్పడం అవాస్తవమన్నారు. మంత్రుల కమిటీ అవాస్తవాలు చెబుతూ ప్రజల్లో గందరగోళం రేపుతోందన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఛలో విజయవాడతో పాటు అన్ని సంఘాలతో కలసి సమ్మెకు వెళ్తామని దివాకర్ రావు స్పష్టం చేశారు.

* ఉమ్మడిజిల్లాలో సోమవారం 956మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 5,435 మందికి పరీక్షలు నిర్వహించగా 744, భద్రాద్రి జిల్లాలో మొత్తం 3,481మందికి పరీక్షలు చేయగా 212మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. 320పడకల ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్‌వార్డులో సోమవారం ఎవరూ చేరలేదు. 46 మంది చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలో 1635మంది టీనేజర్లకు టీకా వేశారు.

* చిత్తూరు జిల్లాలో ఉమ్మడి పరీక్షల విభాగం నిర్లక్ష్యం బయటపడింది. సమ్మేటివ్ వన్ పరీక్షా పత్రాలు ప్రైవేట్ పాఠశాలలకు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా డీఈవోకు ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఫిర్యాదు చేశారు. నిన్నటి రోజున తెలుగు కాంపోజిట్ పేపర్‌కు బదులుగా జనరల్ పరీక్ష పత్రం అందజేశారు. పరీక్షా పత్రాల రుసుం కింద 2.05 లక్షల మంది ప్రైవేట్ విద్యార్థుల దగ్గర 1.60 కోట్ల రూపాయలను ఉమ్మడి పరీక్షల విభాగం వసూలు చేసింది. ఇవాళ తొమ్మిదిన్నర గంటలకు పరీక్షలు ప్రారంభం అయినా పరీక్షా పత్రాలు సరఫరా కాని పరిస్థితి. ఉమ్మడి పరీక్ష విభాగంలో భారీగా స్కాం జరిగిందని అన్ ఎయిడెడ్ ప్రైవేటు స్కూల్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది.

* నెల్లూరు జిల్లా పునర్విభజనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ‘‘గూడూరు జిల్లా చేయండి లేదా నెల్లూరు జిల్లాలోనే ఉంచండి’’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గూడూరు ఆర్డీవోకు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

* పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి వామపక్షాలు మద్దతు తెలిపాయి. మంగళవారం ఉదయం విజయవాడలోని దాసరి భవన్‌లో వామపక్షాలు సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. పీఆర్సీ అనేది ఎప్పటి నుంచో ఉందనిఉద్యోగులు కూడా న్యాయబద్దంగానే పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారన్నారు. మాసాల పాటు మిశ్రా కమిషన్ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే.. ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కమిషన్ నివేదికను వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక ఇవ్వకుండా చర్చలకు రమ్మంటే ఉద్యోగులైనా ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువ ఉంటుందని\జగన్ ప్రభుత్వంలో మాత్రం ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా తిరిగి వారిపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆందోళనకు గురిచేయడం బాధాకరమన్నారు. విభజన విషయంలోనూ ఏకాభిప్రాయంగా నిర్ణయాలు తీసుకోవడం దూరదృష్టకరమన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ ఉద్యోగులకు వామపక్షాలు అండగా ఉంటాయని రామకృష్ణ స్పష్టం చేశారు.

* కృష్ణా జిల్లా కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కాలేజీ నుండి పెద్ద మసీదు వరకు ఎస్ ఎఫ్ ఐ మరియు మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దీక్షిత గౌరీకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని విద్యార్థులునినాదాలు చేశారు.

* పీఆర్సీఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల విజయవాడలో భారీగా ఉద్యోగులు సమావేశం అవుతున్నారని మంగళవారం ఉదయం హైకోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని అడ్వకేట్ కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ అంశంతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏమైనా ఉంటే ప్రభుత్వం వద్దకు వెళ్లాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది.

* బడ్జెట్‌ ముందర గ్యాస్‌ సిలిండర్‌ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్‌ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించగా.. వరుసగా నాలుగో నెలలోనూ చాలా చోట్ల సిలిండర్‌ ధరల పెంపు ప్రకటన వెలువడకపోవడం విశేషం. ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే.