మణిపూర్ దేశానికే మణిపూస లాంటిది. అక్కడి ప్రకృతి అందాలు, ప్రత్యేక వస్ర్తాలు, నగలు మణిపూర్‌ను ఎప్పుడూ ముందు వరుసలో ఉంచుతాయి. అలాంటి ప్రత్యేకతల్లో ఒకటి.. షామిలామి ఎంబ్రాయిడరీ. రకరకాల ఆకారాల్లో అల్లడం, కుట్టడం దీని ప్రత్యేకత. ప్రాచీన కాలం నుంచీ ఎక్కువగా పురుషుల లుంగీలకు అంచుగా వేస్తున్నారు.మహిళల పట్టు లంగాలు, గౌను అంచులకూ ఈ ఎంబ్రాయిడరీ అందంగా ఉంటుంది. షామిలామి ఎంబ్రాయిడరీ నాగాలాండ్‌లోనూ కనిపిస్తుంది. దీన్ని వాళ్లు చెద్దర్లు, శాలువాలపై వేస్తుంటారు. ఈ ఎంబ్రాయిడరీలో అక్యోబీ, హిజయ్, తిందోగ్బీ, మయిబంగ్.. అని నాలుగు రకాలు. అక్యోబీలో పాము, వృత్తాలు ప్రధానంగా కనిపిస్తాయి.హిజయ్‌లో నలుపు, తెలుపు, గులాబి రంగు దారాలతో డిజైన్లు వేస్తారు. తిందోగ్బీ డిజైన్ వంకర్లు తిరుగుతూ ఎంతో అందంగా ఉంటుంది. చూడ్డానికి.. ఆకును తింటున్న గొంగళి పురుగులా కనిపిస్తుంది. ఇక మయిబంగ్ ఎంబ్రాయిడరీలో ప్రకృతి అందాలు ప్రముఖంగా ఉంటాయి.